పట్టు సాధించిన కిరణ్..కేబినెట్ లోకి మరో ముగ్గురు
Published on: Tue Feb 7, 2012 8:32AM
హైదరా
బాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు వచ్చి చేరారు. దీంతో రాష్ట్ర కేబినెట్లో మరో ముగ్గురికి స్థానం లభించింది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరిని ఇంతకు ముందు మంత్రి వర్గంలోకి తీసుకున్న కిరణ్ ఇప్పుడు ముగ్గురిని మంత్రులుగా చేర్చుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగా రెడ్డి జిల్లాకు చెందిన ప్రసాద్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రు మురళిలు మంత్రులుగా నియమితులయ్యారు. ఊహించని విధంగా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. కొత్తగా నియమితులైన మంత్రులతో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా అవకాశం దొరికిన వారిలో ఇద్దరు ఎస్సీలు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమానికి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి హాజరుకాలేదు. సబితా, డిఎల్ అసంతృప్తితోనే కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. ఇంతకు ముందు రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జూపల్లి కృష్ణారావు స్థానంలో కొండ్రు మురళికి స్థానం కల్పించారు. బర్తరఫ్ అయిన పి. శంకరరావు స్థానంలో ప్రసాద్ కుమార్‌కు ఆయన మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
కాగా, కొత్త మంత్రుల ఎంపికతోపాటు వారికి శాఖల కేటాయింపులోనూ సీఎం కిరణ్ తనదైన శైలిలో 'బ్యాటింగ్' చేశారు. తనకు నచ్చిన వారికి పదవులు ఇస్తూనే... నచ్చని వారి శాఖల్లో కోత కోశారు. 'ఒక్క బంతికి రెండు సిక్సర్లు' కొట్టారు. డీఎల్ రవీంద్రా రెడ్డి నుంచి వైద్య విద్య, 108, 104 సర్వీసులను తప్పించి వాటిని తనకు సన్నిహితుడైన కోండ్రు మురళికి అప్పగించారు. 108 సేవలు నిర్వహిస్తున్న జీవీకేపై డీఎల్ బహిరంగ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవీ కృష్ణారెడ్డి సీఎంకు సన్నిహితుడు. దీంతో డీఎల్ విమర్శలు పరోక్షంగా ముఖ్యమంత్రినే తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను వైద్య ఆరోగ్య శాఖకు మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. 'ఇది పొమ్మనకుండా పొగబెట్టడమే' అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కిరణ్‌కు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఉన్నత విద్యాశాఖతోపాటు వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వ్యవసాయశాఖను కూడా రాజనర్సింహ నిర్వహిస్తున్నారు.'డిప్యూటీ' హోదాలో తనకు హోంశాఖ కట్టబెట్టాలన్నది రాజ నర్సింహ అభిప్రాయం. ఆయన కోరుకున్నది జరగకపోగా, ఉన్న శాఖల్లోనే ఒకటి ఊడిపోయింది. రాజ నర్సింహ నుంచి వ్యవసాయాన్ని తప్పించి దానిని కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. కన్నా చేతిలోని గృహనిర్మాణ శాఖను కొత్త మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. శంకర్రావు రాజీనామాతో ఖాళీ అయిన చేనేత, జౌళి శాఖను ప్రసాద్ కుమార్‌కు అప్పగించారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుల ద్వారా సీఎం కిరణ్ 'నేను బలహీనుడిని కాను' అనే సంకేతాలను పంపారు.
సైన్యంలో కెప్టెన్‌గా ఎంత క్రమశిక్షణగా పనిచేశానో మంత్రిగా అంతే క్రమశిక్షణతో పనిచేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటన్నారు. తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పుడు ఇస్తే ఎందుకు విమర్శిస్తోందని ఆయన అడిగారు. ఏ శాఖ అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని ఆయన అన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు కొండ్రు మురళి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందుకు విప్ పదవికి కొండ్రు మురళి రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైద్య విద్యను, ప్రసాద్ కుమార్‌కు చేనేత జౌళి శాఖను, కొండ్రు మురళికి ఆర్‌డబ్ల్యుఎస్ శాఖను కేటాయించారు. కొత్తగా ముగ్గురు చేరడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కోస్తాంధ్రకు చెందినవారు 17 మందికి ప్రాతినిధ్యం లభించింది. కొండ్రు మురళి చేరికతో ఈ సంఖ్య 16 నుంచి 17కు పెరిగింది. తెలంగాణకు కూడా అంతే ప్రాతినిధ్యం ఏర్పడింది. ఇంతకు ముందు 13 మంది మంత్రులు ఉండగా, ఆ సంఖ్య ఇద్దరి చేరికతో 15కు పెరిగింది. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రితో కలిపి 9 మంది ఉన్నారు.


