TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మార్పులకు ముందే బ్రేకు

Published on: Sat Feb 4, 2012 8:46AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆశించినట్టుగా కేబినెట్‌లో భారీ మార్పులకు అవకాశాలు కనిపించడం లేదు. మార్పులు లేకుండా కేవలం చేర్పులతోనే సరిపెట్టాలని హైకమాండ్ ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముగ్గురు నలుగురిని కేబినెట్‌లోకి తీసుకోవడంతోనే సరిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ మార్పులే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. కేబినెట్ మార్పుల విషయంలో హైకమాండ్ మనసు ఏమిటన్నది ముందుగానే ముఖ్యమంత్రికి ఢిల్లీ పెద్దలు తెలియజేసినట్టు తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో మంత్రివర్గంలో భారీ మార్పులు చేయవద్దని, ముగ్గురు, నలుగురికి అవకాశం కల్పిస్తూ మంత్రివర్గ విస్తరణకే పరిమితం కావాలని అధిష్ఠానం ప్రముఖులు ముఖ్యమంత్రికి చెప్పినట్టు తెలిసింది. మంత్రివర్గ మార్పులపై ముఖ్యమంత్రి భారీ కసరత్తే చేపట్టారు. కనీసం నలుగురికి ఉద్వాసన చెప్పడం, ఆరేడుగురు కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకునేలా ముఖ్యమంత్రి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే అధిష్ఠానం మాత్రం మంత్రివర్గ మార్పులకు ఎంతమాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో మంత్రివర్గ మార్పులు చేయడం అంటే అనవసర తలనొప్పులు కొని తెచ్చుకోవడమే అవుతుందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం తగ్గినందున దాన్ని భర్తీ చేసేందుకు, తనకు ఇష్టమైన మరో ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మాత్రమే అధిష్ఠానం అనుమతి ఇవ్వనున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఈ అనుమతిని ముఖ్యమంత్రికి హైకమాండ్ ఇంతకుముందే ఇచ్చింది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నపుడే వీరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అధిష్ఠానం అంగీకరించింది. అయితే మంత్రివర్గంలో భారీ మార్పులు చేయాలన్న ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతోనే సరిపెట్టారు.


మంత్రివర్గంలో తెలంగాణకు సంబంధించి మూడు ఖాళీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేర్లను ముఖ్యమంత్రి ఇప్పటికే ఖరారు చేశారు. తెలంగాణలో మూడో వ్యక్తి కోసం వెదుకుతున్నా ముఖ్యమంత్రికి నచ్చిన వారు ఎవరూ కనిపించడం లేదని తెలిసింది. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్ దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రదీప్‌కుమార్ పేర్లు పరిశీలనకు వచ్చినట్టు తెలిసింది. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కె జానారెడ్డి మంత్రివర్గంలో ఉండగా, అదే సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు దామోదర్‌రెడ్డిని కూడా తీసుకున్నట్లయితే ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం విమర్శలకు దారి తీస్తుందని, దీనికితోడు దామోదర్‌రెడ్డి సోదరుడు ఆర్ వెంకటరెడ్డి కూడా మంత్రివర్గంలో ఉన్నారన్న కారణంగా దామోదర్‌రెడ్డి పేరును జాబితా నుంచి తొలగించినట్టు తెలిసింది. ఇక సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం. అధిష్ఠానం నుంచి అనుమతి లభించిన తర్వాత ఈనెల ఎనిమిది లేదా తొమ్మిదినగాని కేబినెట్ విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు తెలిసింది.