TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు ఇన్.. దాసరి ఔట్ ?

Published on: Fri Dec 23, 2011 3:43PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దానికన్నా ముందుగానే ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రముఖ దర్సక, నిర్మాత దాసరి నారాయణరావుకు కాంగ్రెసు అధిష్టానం మొండిచేయి చూపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాసరి నారాయణ రావు మొదటి నుంచి కాంగ్రెసు వైపే ఉన్నారు. గతంలో కేంద్ర మంత్రి పదవిని కూడా నిర్వహించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాల పట్ల తీవ్ర విముఖత ప్రదర్సిస్తూ వస్తున్నారు. సినిమాలపై మళ్లీ దృష్టి సారించారు.

ప్రస్తుత రాజకీయాల తీరు పట్ల దాసరి నారాయణ రావు వైరాగ్యం కూడా ప్రదర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా దాసరి నారాయణ రావు పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీరి స్థానంలో కాంగ్రెసు నుంచి నలుగురు రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో దాసరి నారాయణ రావు స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనే యోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో చిరంజీవిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.