ముఖ్యమంత్రి పదవిఫై రాహుల్ లెక్చర్
Published on: Fri Dec 23, 2011 8:43AM
న్యూఢిల్లీ: ఒ
క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే కనీస రాజకీయ అనుభవం ఇరవై యేళ్లు ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ రాజకీయ అనుభవంతో పాటు వివిధ శాఖల పనితీరుపై పూర్తి అవగాహన, పరిజ్ఞానం కూడా ఉండాలంటూ ఆయన పేర్కొన్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాలులో మీడియా, సహచర ఎంపీలతో పిచ్చాపాటిగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గంలో పదవులు స్వీకరించిన వారు రాష్ట్ర రాజకీయాల్లో తల దూర్చరాదన్నారు. కేంద్ర మంత్రులు ఒకే శాఖకు పరిమితం కాకుండా కూడా వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు.
ప్రస్తుత రాజకీయాలకు యువతరం సారథ్యం వహించాలన్నారు. 40-50 యేళ్ళ మధ్య వయస్కులు తగ్గిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు నిరంతరం ప్రజల మధ్య ఉంటే తగిన ఫలితం ఉంటుందని స్వయంగా తెలుసుకున్నట్టు చెప్పారు.ఉత్తరప్రదేశ్‌లో కేవలం ఐదారు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఒక ప్రధాన పార్టీగా తీర్చిదిద్దగలిగామన్నారు. కాంగ్రెస్ పూర్తి పతనావస్థలో ఉన్న సమయంలో కూడా చెప్పుకోదగిన మొత్తంలో ఓట్లు వచ్చాయని, ప్రజల మనసుల్లో కాంగ్రెస్‌కు ఇంకా స్థానం ఉందని ఇది రుజువు చేసిందన్నారు.


