క్లాత్ మాస్క్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే?
Published on: Sat Jan 8, 2022 2:05PM
కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఒమిక్రాన్ వైరస్ యూరప్ ను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆగమాగమవుతోంది. యూఎస్ఏలో రోజూ 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్ దేశాల్లో హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. మనదేశంలోనూ కొవిడ్ కేసులు కొన్ని రోజులుగా ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రోజు లక్షన్నర వరకు కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో జనాల్లో ఆందోళన నెలకొంది.
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు, భౌతికదూరం పాటించడమే పరిష్కారమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్ లేకుంటే గండానికి ఎదురు వెళ్లినట్టేనని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే వైరస్ నుంచి రక్షణలో మాస్క్‌లు అత్యంత కీలకం అయినప్పటికీ.. ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాషన్ వలలో చిక్కుకుపోయాయి. తిరిగి ఉపయోగించడానికి వీలుాగ ఉండే కలర్ ఫుల్ క్లాత్ మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి మాస్కులు ఉపయోగించడం సరికాదంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నందున సింగిల్ లేయర్ మాస్క్‌లను వాడకపోవడమే మేలని చెబుతున్నారు. వీటి వల్ల కేవలం 20 నిమిషాల్లోనే వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సింగిల్ లేయర్ ఉన్న క్లాత్ మాస్క్‌లు వైరస్‌లను మోసుకెళ్లే పెద్ద పెద్ద తుంపరలను అడ్డుకోగలవుగానీ, చిన్న చిన్న ఏరోసెల్స్‌ను బ్లాక్ చేయడంలో సమర్థంగా పనిచేయవని అధ్యయనం తెలిపింది. ధ్రువీకరించిన ఎన్95 మాస్క్‌లు మాత్రం గాలిలోని 95శాతం అణువులను వడబోయగలవని వెల్లడించింది. కానీ చాలా మంది ఫ్యాషన్ కోసమో లేదా తిరిగి వినియోగించే వీలు ఉంటుందనో క్లాత్ మాస్క్‌లను వినియోగిస్తుంటారు. అలాంటప్పుడు వాటిని సర్జికల్ మాస్క్‌లతో కలిపి ధరిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగానీ, ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోన్న ఈ సమయంలో కేవలం క్లాత్ మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ ఒకటే పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.
మాస్క్‌ల వినియోగంపై అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్స్‌తో పాటు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పలు అధ్యయనాలు జరిపింది. వీటి ప్రకారం..
- ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించకుండా ఆరు అడుగుల దూరంలో నిలబడితే.. అందులో ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ ఉంటే.. అప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ సోకుతుంది.
- ఒకవేళ ఇద్దరిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాస్క్ లేకుండా.. అవతలి వ్యక్తి క్లాత్ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్ 20 నిమిషాల్లో వ్యాప్తిస్తుంది.
- ఇక, ఇద్దరూ క్లాత్ మాస్క్‌లు ధరిస్తే గనుక.. 27 నిమిషాల్లో వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది.
- ఒకవేళ ఇద్దరిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాస్క్ లేకుండా.. అవతలి వ్యక్తి కేవలం సర్జికల్ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్ 30 నిమిషాల్లో మరో వ్యక్తికి చేరుతుంది.
- అదే ఇద్దరిలో ఒకరు ఎన్95 మాస్క్ ధరించి.. మరో వ్యక్తి పూర్తిగా మాస్క్ పెట్టుకోకపోతే కనీసం 2.5 గంటల్లో వైరస్ వ్యాపిస్తుంది.
- ఇద్దరూ ఎన్95 మాస్క్‌లు ధరిస్తే.. వైరస్ వ్యాప్తి చెందడానికి కనీసం 25 గంటల సమయం పడుతుందని అధ్యయనంలో తేలింది.
మరోవైపు కొంతమంది నిబంధనల కోసం మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ వాటిని గడ్డం కిందకు వేలాడేస్తున్నారు. అలాంటప్పుడు ఏ రకం మాస్క్ పెట్టుకున్నా ప్రయోజనం శూన్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ధరించే మాస్క్ తప్పకుండా ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగైతేనే వైరస్ నుంచి రక్షించుకోగలమని స్పష్టం చేస్తున్నారు.


