TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెర్మూజ్ జలసంధి మూసివేత.. ప్రపంచ దేశాలకు ఇరాన్ షాక్

Published on: Thu Jun 11, 2026 10:57AM

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు  పీక్స్ కు చేరాయి.  అమెరికా  దాడులకు నిరసనగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.  ఈ జలసంధి గుండా ఏ నౌకా ప్రయాణించడానికి  వీల్లేదనీ, ఒకవేళ  ఈ జలసంధి గుండా ప్రయాణానికి ఏ నౌక ప్రయత్నించినా..  తమ సైన్యం దాడి చేస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)  హెచ్చరించింది. ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి  అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది.    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై  దాడులు ప్రారంభించిన  గంటల వ్యవధిలోనే ఇరాన్  హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది. 

కాగా బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేశ్మ్,  హెంగామ్ ఐలాండ్స్ పరిసరాల్లోని కనీసం ఏడు తీర ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా బలగాలు,  ఇరాన్ నావికా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది.  

ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు గల్ఫ్ ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక అమెరికన్ ఎఫ్-16ఫైటర్ జెట్‌పైకి క్షిపణిని ప్రయోగించి, దానిని వెనక్కి మళ్లించాయి. అదలా ఉంటే..  హెర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు   30 శాతం   ఈ  జలసంధి గుండానే సాగుతుంది.  గతంలో సంక్షోభం ప్రారంభమైన రోజుల్లోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు ఏకంగా 126 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో..  అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం ఉంది.