ఇకనుంచైనా బాధ్యతగా ఉందాం.. చిన్నారుల ప్రాణాలను కాపాడుకుందాం

బోరుబావిలో పడి చిన్నారి మృతి. ఈ వార్త ఒకటి రెండు సార్లు కాదు.. కొన్ని వందల సార్లు వింటున్నాం. విన్న ప్రతిసారి అయ్యో పాపం అంటూ బాధపడుతున్నాం. కాసేపటికి అంతా మర్చిపోయి మళ్లీ మన పనిలో మనం పడిపోతున్నాం. 'నేటి బాలలే రేపటి పౌరులు', 'పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు'.. వంటి వాటిని మాటలకే పరిమితం చేస్తున్నాయి బోరు బావులు. బుజ్జి బుజ్జి మాటలు, బుడి బుడి అడుగులతో అప్పుడే ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటున్న చిన్నారులను బోరుబావులు మింగేస్తున్నాయి. జీవితంలో ఇంకా ఏమి చూడని ఎందరో చిన్నారుల జీవితాలకు అప్పుడే ముగింపు పడటానికి కారణం ఎవరు?. చిన్నారి బోరు బావిలో పడితే నిముషాలు, గంటల్లో ప్రాణాలతో బయటకు తీసే టెక్నాలజీని అందుబాటులో ఉంచని ప్రభుత్వమా?.. నీరుపడని బోరుబావులను నిర్లక్ష్యంగా వదిలేస్తున్న ప్రజలా?.. ఎవరు? ఆ చిన్నారుల చావుకి కారణం ఎవరు?.. ఇద్దరిది తప్పుంది. కానీ, అసలు ప్రమాదానికి కారణమవుతున్న ప్రజలది.. అంటే మనదే ఎక్కువ తప్పుంది.

కష్టం మన వరకు వస్తేనే కానీ బాధ విలువ తెలియదు అంటారు. కానీ, ఎందరో తల్లిదండ్రుల కన్నీళ్లు చూసైనా.. ఆ కష్టం మనదే అనుకొని బాధ విలువ తెలుసుకోవాలి. ఎందరో తల్లిదండ్రుల శోకానికి కారణమవుతున్న బోరు బావుల పని పట్టాలి. నీరుపడని ఖాళీ బోరుబావులను అలా నిర్లక్ష్యంగా వదిలేయకండి. మూతలు పెట్టండి లేదా పూడ్చేయండి. ఆ బోరుబావి మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకోకండి. మీ కాలనీలోనో, మీ ఊరిలోనో లేదా మరెక్కడైనా సరే.. ఖాళీగా వదిలేసిన బోరుబావులు కనిపిస్తే.. కనీస బాధ్యతగా దగ్గరలోని అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇప్పటివరకు మనం నిర్లక్ష్యంగా ఉన్నది చాలు.. చిన్నారుల ప్రాణాలు పోగొట్టింది చాలు. ఇకనుంచైనా బాధ్యతగా ఉందాం. ఖాళీ బోరు బావులను పూడ్చేసి.. చిన్నారుల ప్రాణాలను కాపాడుకుందాం.