జన్మభూమా..రణభూమా

 

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జన్మభూమి-మాఊరు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలతో ఈ కార్యక్రమం జన్మభూమా లేక రణభూమా అనే భావన కలుగుతుంది. నిన్న క్రిష్ణా జిల్లా ఉయ్యురులో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే బోడెప్రసాద్‌, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌, వైకాపా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు ఉయ్యూరు మండలం పెద ఓగిరాలలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో రసాభాస నెలకొంది. ఎమ్మెల్యే బోడెప్రసాద్‌, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ హజరై సభ నిర్వహిస్తుండగా అదే సభకు కొలుసు పార్థసారధి హాజరయ్యేందుకు ప్రయత్నించారు. 

నిన్న జరిగిన పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు గ్రామానికి వచ్చే మార్గంలో జాతీయ రహదారిపై భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అక్కడకు చేరుకున్న పార్థసారధిని లోపలకు పంపకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ సభ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు జాతీయ రహదారిపై అనుచరులతో సహా వచ్చారు. ఎమ్మెల్యేను చూసిన సారథి వర్గీయులు నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే తన వాహన సముదాయాన్ని ఆపి ప్రశ్నించడంతో మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే రెండు వర్గాల అనుచరులు ఎదురెదురుగా రహదారిపై ఉన్న రాళ్లు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల వారిని వారించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వారిని అక్కడ నుంచి పంపించేశారు.

అలాగే కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. జన్మభూమిలో భాగంగా పొందుగల దగ్గర 1350 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అవి పట్టాలు కాదు జవాబుపత్రాలు అంటూ వైసీపీ కరపత్రాల పంపిణీ చేసింది. దీంతో జన్మభూమి దగ్గర కరపత్రాలు పంపిణీ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఇది గొడవకు దారి తీసింది. సాగునీటిశాఖ భూమిని ఎలా ఇస్తారని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మాటామాటా పెరగడంతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు చేయి చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను కూడా వైసీపీ నేతలు తోసేశారు.