జగన్‌కు భారీగా డొనేషన్ ఇచ్చా.. ఎలా గెలవాలో నాకు తెలుసు.!!

 

వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగా తాజాగా మునగపాకలోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో యలమంచిలి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు.. అయితే ఈ సమావేశంలో యలమంచిలి నియోజకవర్గంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి.

 

 

మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సమన్వయకర్త కన్నబాబురాజు మధ్య మాటల యుద్ధం జరిగింది.. బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ 'తనపై నియోజకవర్గ సమన్వయకర్త కన్నబాబురాజు తప్పుడు ప్రచారాలు చేసి తనను అవమానపరుస్తున్నారని, కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మి తనను పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.. అనంతరం మాట్లాడిన కన్నబాబురాజు గత ఎన్నికల్లో జగన్‌కు ఎక్కువ డొనేషన్‌ ఇచ్చింది తానేనని, ఎవరి మాటా లెక్కచేయనని, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో తనకు బాగా తెలుసు అని అన్నారు.. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేయడంతో విజయ్‌సాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. విభేదాలను మరిచి, ఐక్యంగా పని చేసినప్పుడే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయగలుగుతామని అన్నారు.