వైసీపీలో అప్పుడే మొదలైన వర్గపోరు.. మంత్రి సాక్షిగా వార్నింగ్

 

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎం గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేస్తూ భిన్నంగా అడుగులు వేస్తున్నారు. అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం ఆయన అడుగుల్లో నడవట్లేదు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పార్టీలో వర్గపోరు మొదలైంది.

విశాఖ జిల్లాలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ పార్టీలో  వర్గపోరుకి తెరలేపుతున్నారు. అది కూడా ఇదంతా మంత్రి సన్మాన సభలో జరగడం విశేషం. రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అవంతి శ్రీనివాస్ తొలిసారిగా విశాఖ చేరుకున్నారు. తొలిసారిగా నగరానికి వచ్చిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు నగర పార్టీ అధ్యక్షడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానసభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సన్మాన సభలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ల మధ్య మాటల యుద్ధం నెలకొంది.

సన్మాన సభలో కరణం ధర్మశ్రీ ప్రసంగిస్తూ.. విశాఖ రూరల్, ఏజెన్సీ పరిధిలో అన్ని సీట్లు గెలుచుకున్నామని అయితే నగర పరిధిలో మాత్రం నాలుగు సీట్లు కోల్పోయామని ఆ లోటు తీర్చేందుకు మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తించాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. జీవీఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిపేలా అవంతి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాము అంతా అందుబాటులో ఉండి జీవీఎంసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు  చేశారు. కొంతమంది నేతలు ఇక్కడ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దాని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కరణం ధర్మశ్రీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు మాత్రమే మంత్రి కాదని రాష్ట్రానికి మంత్రి అనే విషయాన్ని గుర్తించాలన్నారు. అవంతి శ్రీనివాస్ నాయకత్వంలో జీవీఎంసీ ఎన్నికల్లో ముందుకు వెళ్దామన్నారు. ఈ సందర్భంగా తప్పుడు మాటలు చెప్పొద్దంటూ మెుదటిసారిగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.

ద్రోణంరాజు వ్యాఖ్యలకు ధర్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. తాను తప్పుడు సంకేతాలిచ్చానని కొంతమంది చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపుని దృష్టిలో పెట్టుకుని కూడా అవంతికి మంత్రి పదవి ఇచ్చారని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సాక్షిగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. మంత్రి సాక్షిగా బయటపడిన ఈ మాటల యుద్ధం ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఏంటో.