పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మ'ఒడి' ఒక్కటేగా : క్లారిటీ ఇచ్చిన సర్కార్ !

 

అమ్మ ఒడి పథకం...జగన్ ని ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. అన్ని నవరత్నాలతో పాటు ఇది కూడా కాస్త ఎక్కువ వోట్లే వేసేలా చేసింది. నిజానికి ఎటువంటి ఆలోచనతో జగన్ దీనిని ప్రవేశపెట్టారో తెలియదు గాని, దీని విషయంలో మహిళలు, చదువుకోవాలని ఆసక్తి ఉన్న పిల్లలు మాత్రం చాలా ఆశలే పెట్టుకున్నారు. చాలా వరకు గ్రామాల్లో పిల్లలు చదువుకి ఇబ్బంది కావడంతో పనులకు వెళ్తున్నారు. 

జగన్ అధికారంలోకి వస్తే వారి జీవితాలు బాగావుతాయని వారి తల్లులు భావించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఈ పధకం మీద జగన్ మార్చిన మాటలు, తిప్పిన మడమలు అన్నీ ఇన్నీ కావు. ‘ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తాం’ అని జగన్ సర్కార్ బడ్జెట్ లో ఘనంగా ప్రకటించింది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. నవరత్నాల్లో ఒకటైన ‘అమ్మఒడి’ పథకం కోసం బడ్జెట్‌లో రూ.6455.80 కోట్లు కేటాయించారు. 

వీరికి వచ్చే ఏడాది ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరానికి గాను, వచ్చే ఏడాది జనవరి 26 ని ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు అమ్మకు 15 వేలు ఇస్తామని నియమ నిభందనలు వర్తిస్తాయి అన్నట్టు మాట్లాడుతుంది ప్రభుత్వం. దీనితో విద్యార్ధుల్లో ఇప్పుడు ఆందోళన మొదలయింది. ప్రైవేట్ స్కూల్స్ కి కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించినా ఇప్పుడు ‘అమ్మకు మాత్రమే’ ఇస్తామని చెప్పడంతో చాలా మంది అసహనంగా ఉన్నారు. 

ఇదే విషయాన్ని ఈరోజు అసెంబ్లీలో లేవనెత్తారు టీడీపీ సభ్యులు. ప్రభుత్వం 43 లక్షల మందికే 'అమ్మ ఒడి' వర్తింపచేస్తున్నట్టు ప్రకటించిందని, రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అందుకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు బదులిస్తూ, పిల్లల్ని చదివిస్తున్న తల్లిని దృష్టిలో పెట్టుకునే తాము 'అమ్మ ఒడి' పథకానికి రూపకల్పన చేశామని, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తున్నట్టు వెల్లడించారు.