కేసీఆర్‌కి, సీఎల్ రాజం‌కి చెడింది: బీజేపీలో చేరిక

 

 

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కి, నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి.ఎల్.రాజం మధ్య ఇంతకాలం కొనసాగిన సత్సంబంధాలు బెడిసికొట్టాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కి, టీఆర్ఎస్‌కి తన పత్రిక ద్వారా ఎంతో మద్దతు ఇచ్చిన సీఎల్ రాజం బుధవారం నాడు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అది ఆయనకి, కేసీఆర్‌కి మధ్య దూరం పెరిగిన విషయాన్ని తెలియజేస్తోంది. సి.ఎల్.రాజం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆయన గురువారం నాడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరానన్నారు. బీజేపీ ద్వారా దేశానికి సేవ చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌ని వ్యతిరేకిస్తూనే మీరు బీజేపీలో చేరారా? అని అడిగిన ప్రశ్నకు రాజం స్పందిస్తూ, ‘‘కేసీఆర్ చాలా పెద్దవాడు.. ముఖ్యమంత్రి.. నేను చాలా చిన్నవాడిని’’ అని సమాధానం చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిసిన తర్వాత కేసీఆర్ అప్పటి వరకూ తనకెంతో ఉపయోగపడినవారిని దూరం పెట్టడం ప్రారంభించారు. రాజకీయ ఐకాస కన్వీనర్ కోదండరామ్‌ని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. అదే తరహాలో రాజం విషయంలో కూడా కేసీఆర్ అవమానకరంగా వ్యవహరించి వుండవచ్చన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే రాజం కేసీఆర్‌కి దూరమై బీజేపీకి దగ్గరయ్యారని అనుకుంటున్నారు.