TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొవాగ్జిన్‌పై తెలుగువాళ్లే కుట్ర‌.. జ‌స్టిస్‌ ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్‌..

Published on: Fri Dec 24, 2021 10:12AM

కొవాగ్జిన్‌. కొవిడ్ పాలిటి బిగ్ వెప‌న్‌. మిగ‌తా అన్ని వ్యాక్సిన్ల‌కంటే మెరుగ్గా ప‌ని చేస్తోంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. ప్ర‌పంచ దేశాల‌కూ భారీగా ఎగుమ‌తి అవుతున్నాయి. అందులోని.. కొవాగ్జిన్ త‌యారీ సంస్థ భార‌త్ బ‌యోటెక్‌ మ‌న తెలుగు కంపెనీనే కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. కానీ, కొంద‌రికి మాత్రం కాదు. కొవాగ్జిన్‌పైనా రాజ‌కీయం చేశారు కొంద‌రు. వ్యాక్సిన్‌పైనా కుల ముంద్ర వేశారు. కొవాగ్జిన్‌ను అడ్డుకోవాల‌ని చూశారు. పెద్ద స్థాయిలో కుట్ర‌లు చేశారు. అలాంటి హార్డిల్స్ అన్నీ దాటేసుకొని.. కొవిడ్ పాలిట సుర‌క్ష వ్యాక్సిన్‌గా దూసుకుపోతోంది కొవాగ్జిన్‌. తాజాగా, సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. కొవాగ్జిన్‌పై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఓ తెలుగువాడి ఎదుగుదలను మరో తెలుగువాడు గుర్తించకపోగా.. చిన్నచూపు చూసే దురలవాట్లు మానుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. తెలుగువాడు రూపొందించిన కొవాగ్జిన్‌ ఇతర వ్యాక్సిన్‌లతో పోల్చితే ప్రభావంగా పనిచేస్తోందని, కొత్త వేరియంట్‌లను కూడా నిరోధించగలుగుతోందని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ తయారీ సమయంలో నిరుత్సాహ పరచడంతో పాటు, డబ్యూహెచ్‌వో నుంచి అనుమతులు రాకుండా ఉండేందుకు కొంత మంది ప్రయత్నించారని, వారిలో విదేశీయులతో పాటు మనవాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి ధోరణి విడిచిపెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. తెలుగువాళ్లంతా  ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జ‌స్టిస్ ర‌మ‌ణ ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రి గురించి చేశారో అంద‌రికీ ఈజీగానే అర్థ‌మైపోతోంది. కొవాగ్జిన్‌ను అడ్డుకోవాల‌ని చూసింది ఏ పాల‌కులో అంద‌రికీ తెలిసిందే అంటున్నారు. 

డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదానోత్సవానికి సీజేఐ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. త‌న వ్య‌క్తిగ‌త అనుభ‌వాల‌నూ చెప్పారు. కోర్టు గదుల్లో రోజుల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముక, మెడ నొప్పితో బాధపడే వాడినని, తనకు గత 20 ఏళ్లుగా ప్రకృతి వైద్యులు డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ చికిత్సను అందిస్తున్నారని, తనతోపాటు సుప్రీం కోర్టులో మరో 10 మంది  న్యాయమూర్తులకు కూడా ఆయనే వైద్యం చేశారని చెప్పారు. 

తల్లిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించడం మన సంప్రదాయమని.. తెలుగు భాషను, తెలుగు జాతిని రక్షించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పించడంతోపాటు ఇంట్లో ఉన్న సమయంలో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.