సీబీఐపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు.. పోలీసులపైనా ఆసక్తికర కామెంట్లు..
Published on: Fri Apr 1, 2022 6:32PM
పోలీసు అధికారాలను రాజకీయ నాయకులు దుర్వినియోగం చేయడం ఎప్పటినుంచో ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదని.. నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనడమే పోలీసుల తక్షణ కర్తవ్యంమని.. పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదని.. అందరి విషయంలో చట్టం సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అన్నారు సీజేఐ.
సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డి.పి.కోహ్లీ 19వ స్మారక ఉపన్యాస కార్యక్రమానికి సీజేఐ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపాన్యాసం చేశారు. "ఆరంభ దశల్లో సీబీఐపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది. నిష్పాక్షికత, స్వతంత్రత విషయంలో సీబీఐ ప్రతీకగా నిలిచేది. న్యాయం కోసం బాధితులు సీబీఐ వైపే చేసేవారు. కాలక్రమంలో తన చర్యల ద్వారా సీబీఐ చర్చల్లో నిలిచింది. విలువలు, నైతికతకు కట్టుబడి ఉంటే ఎవరూ మిమ్మల్ని అడ్డగించలేరు". అని అన్నారు.
"పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం, స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం. ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలి. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలి". అని అభిప్రాయపడ్డారు జస్టిస్ రమణ.
"శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలోని అంశం. చాలా వరకు నేర విచారణ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుంది. విశ్వసనీయతలో జాతీయ సంస్థల కంటే పోలీసులు వెనకబడుతున్నారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరం. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపడాలి. అందుకోసం పోలీసుల శిక్షణ తీరులో మార్పు రావాలి. నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. దర్యాప్తు సంస్థలే శాశ్వతం" అని సీజేఐ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


