ఇంకా ఇబ్బంది పడుతున్నా.. సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన..
Published on: Wed Feb 23, 2022 3:05PM
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఎప్పుడూ హుందాగా, ప్రశాంతంగా ఉంటారు. దేశంలోకే పవర్‌ఫుల్ పోస్టులో ఉన్నా.. చాలా సాదాసీదాగా ఉంటారు. నిత్యం న్యాయ, రాజ్యాంగ విషయాలతో బిజీ బిజీగా గడుపుతుంటారు. చాలా అరుదుగా మాత్రమే పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటారు. తాజాగా, అలాంటిదే తన వ్యక్తిగత విషయం ఒకటి వెల్లడించారు. తనకు ఇప్పటికే ఒమిక్రాన్ వచ్చి..తగ్గినా కూడా.. ఇప్పటికీ తాను కొవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నానని చెప్పారు.
సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణలు ప్రారంభించాలని ఓ సీనియర్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సీజేఐ ఇలా స్పందించారు. ఒమిక్రాన్ సోకి తగ్గినప్పటికీ.. దాని ప్రభావంతో తాను ఇంకా బాధపడుతున్నానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు.
"నాకు ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. నాలుగు రోజుల్లోనే తగ్గింది. కానీ ఇంకా నాపై దాని ప్రభావం ఉంది. ఇది సైలెంట్ కిల్లర్ లాంటిది. నేను కరోనా తొలి వేవ్‌లో వైరస్ బారిన పడి త్వరగానే కోలుకున్నా. కానీ, ఇప్పుడు ఈ వేవ్‌లో నాకు ఒమిక్రాన్ సోకి 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా వైరస్ అనంతర ప్రభావాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నా" అని సీజేఐ రమణ అన్నారు.
దేశంలో కేసులు ఇప్పటికీ ఎక్కువగానే నమోదవుతున్నాయని.. బుధవారం కూడా 15వేలకు పైనే కొత్త కేసులు వచ్చాయని సీజేఐ తెలిపారు. వైరస్ పరిస్థితి సమీక్షించి.. పూర్తి స్థాయి భౌతిక విచారణలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


