TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి కేసు.. నాట్ బిఫోర్ మీ అన్న సీజేఐ

Published on: Tue Nov 1, 2022 1:49PM

అమరావతి కేసులో సుప్రీంలో  ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యూయూ లలిత్ ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ విచారణ నుంచి తప్పుకుని వేరే బెంచ్ కు బదిలీ చేశారు. వేరే బెంచ్ లో ఈ కేసు లిస్ట్ అయి విచారణకు రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో వాస్తవానికి మంగళవారం (నవంబర్ 1)) జరగాల్సి ఉంది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ.లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో ఈ కేసు విచారణకు నిరాకరిస్తూ నాట్ బిఫోర్ మి అన్నారు. విభజన చట్టంపై గతంలో తన అభిప్రాయం చెప్పానని అందుకే  వేరే బెంచ్‌పై విచారణ  జరపాలన్నారు. వేరే బెంచ్‌పై వీలైనంత త్వరగా విచారణకు అనుమతి ఇవ్వాలని సూచించారు.  

దీంతో ఈ కేసు విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే. అయితే ఈ తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీం  కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.  వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.

 ప్రభుత్వ వాదనపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసా గించాలని రైతులు కోరుతున్నారు. ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని ఆరోపిస్తున్నారు. విభేదాలు సృష్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, పాదయాత్రను అడ్డుకోవడం, దాడులు చేయడం మానుకోవాలని రైతులు అంటున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉండాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. హైకోర్టు తీర్పుని వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని రైతులు చెబుతున్నారు.