TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నియామకాలు చేపడితే అందరికీ మంచిది.. కేంద్రానికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్!

Published on: Wed Sep 15, 2021 1:38PM

కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ వ్యవహారంపై  విచారణ సందర్భంగా సీజేఏ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని సీజేఐ స్పష్టం చేశారు. ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడంలేదని, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 

ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం కోసం రెండేళ్లు సమయం తీసుకున్నారని, ఆలస్యానికి కరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని సీజేఏ జస్టిస్ రమణ అన్నారు. రూల్‌ ఆఫ్‌ లా, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఒక ఏడాది పనిచేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. ట్రైబ్యునళ్లలో భర్తీ ఆలస్యంతో ఖాళీల సంఖ్య పెరుగుతుందన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. 

ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని సీజేఐ అన్నారు. దిక్కరణ పిటిషన్‌ విచారణ వేళ ఏదో ఒకటి చెప్పడం అలవాటైందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వారంలో కౌంటర్‌ వేస్తామని ఏజీ చెప్పగా..  కౌంటర్‌ దాఖలు సమస్యకు పరిష్కారం కాదని జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమన్నారు. సమస్యలు అందరికీ తెలుసునని, కావాల్సింది పరిష్కారమన్నారు. ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నామని, మరికొంత ఓపిక పట్టగలమని అన్నారు. కోర్టు ఉత్తర్వులు రాకముందే నియామకాలు చేపడితే అందరికీ మంచిదన్నారు. రెండువారాల్లో స్పష్టత ఇవ్వకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ హెచ్చరించారు. 

జాతీయ గిరిజన కమిషన్‌ నియామకంలో ఇలాగే వ్యవహరించారని జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు. డిఆర్‌టిలో కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ కోల్‌కతా వెళ్లాల్సి వస్తోందని, కోల్‌కతాలో కూడా శాశ్వత సభ్యులు లేరని అన్నారు. జబల్‌పూర్‌ నుంచి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇలాగే చేస్తే.. సమస్యల పరిష్కారం ఎప్పటికి సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అటార్నీ జనరల్ కోరిన విధంగా విచారణను రెండు వారాలు వాయిదా వేస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమని జస్టిస్ ఎన్‌వి రమణ తేల్చి చెప్పారు.