TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే నిందలు,దాడులు! సీజేఐ ఎన్వీ రమణ కామెంట్లు ఏపీ గురించేనా? 

Published on: Sun Dec 26, 2021 2:15PM

జడ్జీల నియామకాలు, కోర్టు తీర్పులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారనడం అతిపెద్ద భ్రమ అని అన్నారు.విజయవాడలోని సిద్ధార్థ లా కాలేజీలో నిర్వహించిన లావు వెంకటేశ్వర్లు ఎండోమెంట్ లెక్చర్ కార్యక్రమంలో ‘భారత న్యాయవ్యవస్థ– భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అయితే, ప్రచారంలో ఉన్న భ్రమ అని అన్నారు. మిగతా అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థ కూడా ఆటలో ఓ పావే అని అన్నారు. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని సీజేఐ తేల్చి చెప్పారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా, అది తెలిసిన వాళ్లు కూడా ‘జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. 

అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే ఎన్నెన్నో నిందలు వేస్తున్నారని, శారీరక దాడులకూ దిగుతున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ఆ ఘటనలపై కోర్టులు స్పందించేంత వరకూ ఏ అధికారులూ స్పందించడం లేదని, ఘటనలపై దర్యాప్తు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సురక్షితమైన వాతావరణం కల్పించినప్పుడే జడ్జిలు నిర్భయంగా పనిచేయగలుగుతారని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు.దురదృష్టంకొద్దీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లంతా ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మల్లాగే ఉంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా పనిచేయలేరన్నది పెద్ద ఆశ్చర్యపోయే విషయమేమీ కాదన్నారు. అవసరం లేని కేసులు కోర్టు వరకు రాకుండా ఆపడంలో వారేమీ చేయలేకపోతున్నారన్నారు. ఆలోచించకుండానే బెయిల్ అప్లికేషన్లను తిరస్కరిస్తుంటారని, నిందితులకు లాభపడేలా విచారణ సమయంలో ఆధారాలను తొక్కిపెట్టేస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించి ఓ స్వతంత్ర ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే ఎన్నెన్నో నిందలు వేస్తున్నారని, శారీరక దాడులకూ దిగుతున్నారంటూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చగా మారాయి. ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించే సీజేఐ చెప్పారనే చర్చ జరుగుతోంది. ఏపీలో కోర్టు తీర్పులను నిందిస్తూ, న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సీబీఐ విచారణకు ఆదేశించింది. న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. కొందరు అరెస్ట్ కూడా అయ్యారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన కామెంట్లు హాట్ హాట్ గా మారాయి.