TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూల్‌ ఆఫ్‌ లా లేకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు! సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..

Published on: Sun Dec 26, 2021 8:37AM

రాజ్యాంగ వ్యవస్థలు పరిధి దాటినప్పుడు మాత్రమే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే, ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి రాదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థ అయినా, న్యాయవ్యవస్థ అయినా పరిధికి లోబడి పనిచేయాలని సూచించారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ జస్టిస్‌ రమణకు జీవన సాఫల్య పురస్కారం, సిద్ధార్థ అకాడమీ సిద్ధార్థ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. రాజ్యాంగానికి ఆర్టికల్‌ 19, 21 గుండె వంటివన్నారు. సమాజంలో పౌరహక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయవ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని చెప్పారు. 

తమ హక్కులు, బాధ్యతలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంలో రాజ్యాంగంపై విస్తృతంగా చర్చ జరుగుతుండడం మంచి పరిణామం అన్నారు.
రాజ్యాంగం కొద్దిరోజుల క్రితం వరకు గ్రంథాలయాలకు పరిమితమై ఉండేదని.. కాని ఇప్పుడు దానిపై ఇళ్లల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇంకా నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, మూఢనమ్మకాలు ఉన్నాయన్నారు.  వాటిని రూపుమాపడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అప్పుడే వారికి రాజ్యాంగంపై అవగాహన పెరుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అత్యంత ముఖ్యమైన రూల్‌ ఆఫ్‌ లా ప్రజలకు వివరించాలని, లేకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. 

సమాజంలో న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లను మేధావివర్గంగా భావిస్తారని, ప్రజలు వారిపై అనేక ఆశలు పెట్టుకుంటారని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ  చెప్పారు. ప్రజలకు దశదిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ఈ వర్గంపై ఉందని, అప్పుడే దేశానికి, రాజ్యాంగానికి గౌరవం చేకూర్చినట్టవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రాధాన్యాన్ని మరచిపోయే పరిస్థితి ఉందన్నారు. పోలీసులు ఇళ్లకు వచ్చినప్పుడు, సమస్యలు ఉత్పన్నమయినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయస్థానాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. న్యాయస్థానాలకు వెళ్లకపోవడమే మంచిదన్న భావన చాలామందిలో ఉందన్నారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. ఒక కేసు గురించి ఇద్దరు న్యాయవాదులు, న్యాయమూర్తి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతున్నాయో కక్షిదారులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని విధానాలు, పద్ధతుల వల్ల న్యాయస్థానాలను ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారని చెప్పారు.