10 శాతం రిజర్వేషన్ల బిల్లు.. ఇంతలోనే మరో బిల్లుతో షాకిచ్చిన కేంద్రం

 

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం కీలక బిల్లులను ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ తర్వాత వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును కూడా సభ ముందుకు తెచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌, ఇతర పొరుగు దేశాల్లో మైనార్టీలు తీవ్ర హింసను ఎదుర్కొంటున్నారు. వారంతా ఆశ్రయం కోసం భారత్‌ వైపు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చింది . అయితే దీనిపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం అసోం రాష్ట్రం కోసం కాదు. పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే శరణార్థుల అందరి కోసం. పశ్చిమ సరిహద్దుల నుంచి కూడా చాలా మంది శరణార్థులు రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు వస్తున్నారు. వారందరి కోసమే ఈ బిల్లు. అసోం ప్రజల హక్కులను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది’ అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ సవరణ వల్ల అసోంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని దీన్ని సెలక్షన్ కమిటీకి పంపించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. అయితే ఇందుకు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ నిరాకరించారు. దీంతో ప్రభుత్వం తీరును నిరసనగా కాంగ్రెస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది. బిల్లు ఆమోదం పొందితే అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటాయని తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్‌ హెచ్చరించారు. అయినా విపక్షాల ఆందోళనల నడుమే ఈ బిల్లు ఆమోదం పొందింది.