ఆ స్టోరీ చదివితే చలించిపోవాల్సిందే.. మాజీప్రధాని జీవితంలో సినిమాటిక్ సీన్స్..
Published on: Thu Feb 10, 2022 4:28PM
సీన్ 1: ఆయన ఓ వృద్ధుడు. వయసు 94 ఏళ్లు. ఉండేది అద్దె ఇంటిలో. ఆ ఉండే ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితి. ఇంటి యజమాని ఆ వృద్ధుడి సామాన్లు బయట పడేశారు. సామాను అంటే.. మంచాలు, పరుపులు, కుర్చీలు, సోఫాలు కాదు. ఓ పాత మంచం, నాలుగు సత్తు గిన్నెలు, ఒక ప్లాస్టిక్ బకెట్, ఓ మగ్గు అంతే. అదే ఆయన ఆస్తి. ఆ వృద్ధుడు ఇంటి యజమానిని వేడుకుంటున్నారు. కొద్దిగా టైమ్ ఇస్తే అద్దె చెల్లిస్తానని.. అంతవరకూ ఇంట్లో ఉండనీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారు కూడా ఆ పెద్దాయన దయనీయ పరిస్థితి చూసి జాలిచూపుతున్నారు. ఇంటి యజమానిని గడువు ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు ఆ ఓనర్ అయిష్టంగానే ఇదే ఆఖరి ఛాన్స్ అంటూ కొంత టైం ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ వృద్దుడు యజమాని వీధిలోకి విసిరేసిన సామాను లోపలికి తీసుకు పోయారు. ఇదీ అక్కడ జరిగిన సీన్. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. అలాంటివి వింటుంటాం. చూస్తుంటాం. కానీ, ఈ ఘటనలోని వృద్ధుడు ఎవరో తెలిస్తే.. ఆశ్చర్య పోవడం ఖాయం. అవునా, ఆయనా? అంటూ నోరెళ్లబెట్టడం పక్కా. ఎందుకంటే.. ఇంతకీ ఆ పెద్దాయన ఎవరంటే.....
సీన్ 2: ఆ దారిన వెళుతున్న జర్నలిస్ట్ ఒకరు... ఈ మొత్తం వ్యవహారం చూశారు. ఆ ఘటనను ఫోటోల్లో బంధించాడు. మంచి మసాలా కథ దొరికిందని తెగ ఖుషీ అయ్యాడు. “అద్దె ఇంటి నుంచి వృద్ధుడిని గెంటేసిన ఓనర్” అనే టైటిల్ పెట్టాలని మనుసులో అనుకుంటూ తను పనిచేసే పత్రికా కార్యాలయం చేరుకున్నాడు. పత్రిక యజమానికి జరిగిన కథ చెప్పారు. ఫోటోలు ఆయన ముందుంచారు. ఆ ఫోటోలు చూస్తూనే.. ఆ పేపర్ ఓనర్ షాక్ అయ్యారు. అయ్యో.. ఈయనా.. ఆ ‘వృద్దుడు’ ఎవరో తెలుసా నీకు అని.. జర్నలిస్ట్’ను అడిగారు. జర్నలిస్టు తెల్లముఖం వేశాడు. తెలియదన్నాడు. ఇంతకీ ఎవరు సార్ అతను అని క్యూరియాసిటీతో ప్రశ్నించాడు... ఇంతకీ ఆయన ఎవరంటే...
సీన్ 3: ఆ మర్నాడు.. పత్రిక మొదటి పేజీలో సెన్షేషనల్ స్టోరీ ప్రచురితమైంది. ‘మాజీ ప్రధాని గుల్జారీ లాల్ నందా దుర్భర జీవితం గడుపుతున్నారు’ అనే హెడ్‌లైన్‌తో ఆ ‘వృద్ధుని’ కథ పతాక శీర్షికలో వచ్చింది. ఆ వార్తలో భారత మాజీ ప్రధాని గుల్జారీ లాల్ నందా ఎంతటి దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారో విపులంగా వివరించారు. అద్దె ఇంటి నుంచి గెంటి వేసిన వైనాన్ని ఫొటోలతో సహా ప్రచురించారు. అదే క్రమంలో చోటా మోటా రాజకీయ నాయకుల స్థితిగతులతో... రెండుసార్లు దేశ ప్రధానిగా, ఎన్నో ఏళ్ళు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నందాజీ జీవన స్థితిగతులను పోలుస్తూ, మాజీ ప్రధానికి సొంత ఇల్లులేని వైనాన్ని విశ్లేషించారు.
నిజానికి, గుల్జారీ లాల్ నందా స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే 500ల పెన్షన్‌కు అర్హులు. అయితే, ఆయన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ కోసం.. తాను పోరాటం చేయలేదని.. తనకు ఆ పెన్షన్ అవసరం లేదని తిరస్కరించారు. ఆయనకు వేరే ఆదాయమార్గం లేక పోవడంతో.. మిత్రుల వత్తిడి మేరకు ఆ పెన్షన్ తీసుకునేందుకు అంగీకరించారు. ఆ పెన్షన్ సొమ్ముతోనే ఆయన శేష జీవితం గడిపారు.
సీన్ 4: “మాజీ ప్రధాని గుల్జారీ లాల్ నందా దుర్భర జీవితం గడుపుతున్నారు’ అనే హెడ్‌లైన్‌తో వచ్చిన వృద్ధుని కథ చూసిన వెంటనే.. అప్పటి ప్రధాని.. మంత్రులు, అధికారులను నందా ఉంటున్న అద్దె ఇంటికి పంపారు. వరసగా కార్లు వచ్చి ఆయన ఇంటి ముందు ఆగాయి. అంతా ఆశ్చర్య పోయారు. ఇంటి యజమాని అయితే, బారులు తీరిన వీఐపీ వాహనాలను చూసి.. తమ ఇంట్లో అద్దెకు ఉన్నది మాజీ ప్రధాని నందా అని తెలిసి.. అవాక్కయ్యారు. ఆ వెంటనే ఆయన తెలియక చేసిన తప్పునకు క్షమించమని నందాను వేడుకున్నారు. ఆయన ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు.
ఇక ప్రధాని ఆదేశాల మేరకు వచ్చిన మంత్రులు, అధికారులు నందాను అధికార నివాసానికి మారాలని కోరారు. కానీ, నందా.. ఈ వయసులో ఆ సదుపాయాలు తనకు అవసరం లేదని సున్నితంగా తిరస్కరించారు. తుది శ్వాస విడిచే వరకూ నందా సామాన్య జీవితమే గడిపారు. 1997లో భారత ప్రభుత్వం ఆయన్ని భారతరత్నతో గౌరవించుకుంది. అవీ అప్పటి రాజకీయ నాయకుల విలువలు.. మరి ఇప్పుడో..??


