TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మే 1 నుంచి థియేటర్లు బంద్.. టాలీవుడ్ లో సమ్మె సైరన్

Published on: Wed Apr 15, 2026 8:48AM

తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. నిర్మాతలు, థియేటర్ యజమానుల   మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో తలెత్తిన వివాదం ముదిరి పాకాన పడింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం  వచ్చేనెల 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఆ లోగా తమ సమస్యలు పరిష్కరించాలనీ లేకుంటే థియేటర్ల మూత తప్పదని స్పష్టం చేసింది. 

ప్రధానంగా ఆదాయ పంపకాల విషయంలో కొత్త విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న  రెంటల్ సిస్టమ్  వల్ల తాము భారీగా నష్టపోతున్నామని థియోటర్ యజమానులు అంటున్నారు. పెరిగిన కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు, సిబ్బంది వేతనాల దృష్ట్యా థియేటర్ల నిర్వహణ భారంగా మారిందనీ, అందుకే మల్టీప్లెక్స్‌ల తరహాలో వసూళ్లలో వాటా ఇచ్చే  రెవెన్యూ షేరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎగ్జిబిటర్ల ప్రతిపాదన ప్రకారం.. మొదటి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం వాటాను తమకు కేటాయించాలని కోరుతున్నారు. అయితే..  ఈ ప్రతిపాదనను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ఏటీఎఫ్ పీజీ)   వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిర్మాణ వ్యయాలు పెరిగి నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో అదనపు భారం మోయడం సాధ్యం కాదని అంటున్నారు. దీంతో వివాదం ముదిరి పాకాన పడినట్లైంది. ఈ వివాదం పరిష్కారం కాకుంటే వచ్చే నెల విడుదలయ్యే భారీ చిత్రాలపై ప్రభావం పడే అవకాశం ఉంది

  'స్వయంభూ, మా ఇంటి బంగారం వంటి క్రేజీ  సినిమాలపై థియోటర్ల బంద్ ప్రభావం తీవ్రంగా పడుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అలాగే  రియన్ కనకరాజు, సూర్య కరుప్పు  వంటి చిత్రాల విడుదల సందిగ్ధంలో పడే అవకాశం ఉంది.  ఇక ఈ వివాదం సద్దుమణగకుంటే సమ్మర్ వినోదానికి గండి పడటమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ కోట్లలో నష్టపోతుందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.