మోడి జీవిత కథ ఆధారంగా సినిమా

 

నిజ జీవిత కథలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మరో బయోపిక్‌ తెరకెక్కడానికి సిద్దమవుతుంది.  అయితే ఇన్నాళ్లు స్వాతంత్ర్య సమర యోధులు, క్రీడాకారుల జీవితాలు మాత్రమే తెరకెక్కించిన బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో సత్తా చాటుతున్న ఓ డైనమిక్‌ జీవితాన్ని సినిమా తెరకెక్కిస్తున్నారు.

ప్రస్థుత రాజకీయాల్లో సెన్సెషన్‌ సృష్టిస్తూ భవిష్యత్‌ ప్రదానిగా భావిస్తున్న గుజరాత్‌  ముఖ్యమంత్రి నరేంద్రమోడి జీవిత కథను సినిమా తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు బాలీవుడ్‌ సినీ జనాలు. ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ అయిన మితేష్ పాటిల్‌ ఇప్పటికే ఇందుకు సంభందించిన వర్క్‌ కూడా స్టార్ట్‌ చేసేశాడు.

ఒక టీస్టాల్‌లో సామాన్యుడిగా జీవితాన్ని మొదలు పెట్టిన ఓ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగటంతో పాటు భావి ప్రదానిగా కీర్తించబడటంలో ఓ కమర్షియల్‌ సినిమా కు కావలిసిన ఎలిమెంట్స్‌ బాగా ఉన్నాయని భావిస్తున్నారు మితేష్‌.

అంతేకాదు ఈ సినిమా తెరకెక్కించాడానికి ఇప్పటికే మోడి ఆమోదాన్ని కూడా పొందిన మితేష్‌ త్వరలోనే సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నాడు. అయితే సినిమాను పూర్తిగా బయోపిక్‌లా కాకుండా సినిమాకు కావాల్సిన డ్రామాను కూడా కాస్త జోడిస్తూ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు.

నాయకుడిగా ఓట్లు కురిపించిన నరేంద్రమోడి, కథానాయకుడిగా కాసులు కూడా కురిపిస్తాడేమో చూడాలి.