TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవితమ్మా.. నీ బతుకమ్మకు పట్టిన గతేంటో చూడమ్మా

Published on: Wed Oct 13, 2021 9:15PM

బతుకమ్మ అంటేనే తెలంగాణ. తెలంగాణకు ఆ గౌరవం, ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది కూడా బతుకమ్మ వల్లే. నిజాముల కాలంలో రజాకార్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొని ఆత్మగౌరవం నిలబెట్టుకున్న ఓ సాంస్కృతిక విప్లవం బతుకమ్మ పండుగ. అయితే ఆంధ్రాలో కూడా తెలంగాణ సరిహద్దు జిల్లాలకు ఆనుకొని ఉన్న కొన్న ప్రాంతాల్లో బతుకమ్మలు ఆడేవారు. ఇప్పటికీ ఆడుతున్నారు కూడా. కృష్ణా జిల్లాలో గతేడాది బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్న ఓ గ్రామంలో ఆడపడుచులను అక్కడి పోలీసు అధికారి అటకాయించాడు. బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తా  అంటూ గుడ్లురిమాడు. నిస్సహాయులైన ఆ ఊరి ఆడపడుచులు.. ఎంతో నిరాసక్తంగా ఉండిపోయారు. ఈ విషయంలో ఆ పోలీసు అధికారి మీద అప్పట్లో విమర్శలు బాగానే వచ్చాయి. అతను క్రిస్టియన్ కాబట్టే ముఖ్యమంత్రి జగన్ ప్రాపకం కోసం అలా చేసి ఉంటాడన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. అయితే బతుకమ్మ పండక్కి తెలంగాణ ప్రజా జీవనంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఒక్క బతుకమ్మ పేరుతోనే యావత్ ప్రజానీకానికి కనెక్ట్ అయిపోవచ్చు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత బతుకమ్మకే బ్రాండ్ అంబాసిడర్ గా అవతారమెత్తారు. దేశ, విదేశాల్లో కూడా తెలంగాణ జాగృతి బృందాలను ఏర్పాటు చేసుకొని బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సర్కారు కూడా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఆకాశానికెత్తింది. ప్రతియేటా ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తోంది. బతుకమ్మలు ఆడుకోవడానికి మైదనాల ఏర్పాటు, విద్యుద్దీపాలు, సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేస్తోంది. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బతుకమ్మ పండుగలో అధికారికంగా పాల్గొంటున్నారు. అంతేకాదు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేస్తోంది. 

ఇంతటి చారిత్రక నేపథ్యం, పాలనాపరమైన వైభవం సంతరించుకున్న బతుకమ్మను కొందరు క్రైస్తవ మత ప్రచారకులు దుర్వినియోగం చేస్తున్నారు. అమాయకులైన ప్రజలను ప్రలోభపెట్టి బతుకమ్మ పండుగను సాంస్కృతికంగా దెబ్బ తీస్తున్నారు. ప్రధాన స్రవంతి ప్రజల సెంటిమెంట్లు గాయపడేలా వ్యవహరిస్తున్నారు. బతుకమ్మలకు బదులు మధ్యలో  భారీ సైజు శిలువను పెట్టి, శిలువను దీపాలతో అలంకరించి బతుకమ్మ పాటల పేరడీలతో ఏసుక్రీస్తును కొలుస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగినట్టుగా చెబుతున్న ఓ వీడియో మీద సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. 

రామ రామ రామ ఉయ్యాలో... రామనే శ్రీరామ ఉయ్యాలో.. ఇలాంటి పాటలకు బదులుగా దయచూపు ఏసయ్య, నాతో మాట్లాడు ఏసయ్యా.. అంటూ మధ్యలో మత ప్రచారకుడు నిలబడి పాటలు పాడుతూ ఉంటే.. మహిళలంతా బతుకమ్మ స్టయిల్లో చప్పట్లు కొడుతూ పాస్టర్ పాడే పాటలకు కోరస్ ఇస్తున్నారు. హిందూ అక్క-చెల్లెళ్లంతా ఎంతో భక్తి భావనతో, ఉపవాసాలతో దేవీ నవరాత్రుల సమయంలో జరుపుకునే ఈ వేడుక ఈ విధంగా క్రైస్తవమయం అయిపోతుండడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల అవసరాలనే అవకాశాలుగా మలచుకొని, వారిని ప్రలోభపెట్టి మతం మార్చే ప్రక్రియ కాస్తా మరింత పరాకాష్టకు చేరి నేరుగా బతుకమ్మ పండుగలో సైతం మతమార్పిడి వ్యవహారం ప్రవేశించిందని.. మత మార్పిడి కోసం ఇంత నీచానికి దిగజారే క్రైస్తవ ప్రచారకులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పూలకు, పూజలకు దూరం ఉండే క్రైస్తవులు.. పూలకే పూజ చేసే బతుకమ్మ సంస్కృతిని ఇంతగా కలుషితం చేయడం సాంస్కృతికపరమైన దాడిగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. తాము ఎంతో పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగను శిలువ చుట్టూ చేరి ఏసుక్రీస్తు పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకగా జరుపుకోవడం అవమానించడమేనంటున్నారు. 

బతుకమ్మ పండుగకే బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ విషయంలో నోరు మెదపాలంటున్నారు. బతుకమ్మ పేరుతో ప్రచారం చేసుకోగానే సరిపోదని, ఆ పండుగలో ఉండే అసలైన స్ఫూర్తిని కాపాడడంలో కూడా కవిత ముందుండాలంటున్నారు. బతుకమ్మ పండుగను ఇంతలా కలుషితం చేస్తున్న సంబంధిత క్రైస్తవ ఫాదర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటున్నారు. మైనారిటీ ప్రజల మనోభావాలను ఎంత గొప్పగా ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందో మెజారిటీ ప్రజల మనోభావాలకు కనీసం అందులో సగమైనా విలువ ఇవ్వాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 

అమ్మవారి ముందు భక్తి చాటుకున్న అబ్దుల్ అజీజ్

మత స్వేచ్ఛ అంటే ఒకరి మత విశ్వాసాలను పేరడీల పేరుతో కించపరచడం కాదని, అవతలి ప్రజల విశ్వాసాలను సొంత విశ్వాసాలతో సమానంగా ఆదరించడమేనని సికింద్రాబాద్ సీతాఫల్ మండీకి చెందిన అబ్దుల్ అజీజ్ నిరూపించారు. అజీజ్ స్థానిక బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాల్లో అజీజ్ అమ్మవారి మండపాలలో  అన్నదాన కార్యక్రమాల కోసం 25 కిలోల బియ్యం ఇస్తూంటారు. గత కొన్నేళ్లుగా ఆయన ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. మెజారిటీ ప్రజల సెంటిమెంట్లు గౌరవించడంలో అజీజ్ ను చూసి ప్రముఖ రాజకీయ నాయకులంతా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు స్థానికులు. ఎప్పుడూ మైనారిటీల పాట పాడుతూ మెజారిటీ ప్రజల సెంటిమెంట్లకు పూచికపుల్ల విలువ ఇవ్వని పార్టీల కన్నా ఏ రాజకీయాలతో సంబంధం లేని అజీజ్ సర్వమత సమ భావనను ఆచరణలో చూపారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ స్ఫూర్తి ప్రదర్శించినందుకు గాను ఆలయ కమిటీ అజీజ్ ను శాలువాతో సత్కరించడం విశేషం.