TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కలరా కమ్ముకొస్తోంది

Published on: Wed Jul 13, 2016 3:56PM

 

తెలంగాణలో రోజురోజుకీ కలరా కేసులు కలవరపెడుతున్నాయి. మంత్రులు నామోషీకి పోయి మరేం భయం లేదని అభయమిస్తున్నా కలరా జాడ్యం నానాటికీ ప్రబలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం, ఆపై అపరిశుభ్రత... ఏది నల్లా నీరో, ఏది డ్రైనేజో తెలియని వైనం. ఇలాంటి స్థితిలో కనుక ఈ అంటువ్యాధి ప్రబలితే ఏమిటన్న ఆలోచన ఎవరికీ పట్టినట్లు లేదు. కలరా గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు పెద్దగా చొరవ చూపిస్తున్న దాఖలాలూ లేవు. దాంతో అసలు కలరా అంటే ఏమిటో కూడా తెలియకుండానే ‘సగటు జీవులు’ దాని బారిన పడుతున్నారు.

 

నిజానికి కలరా ప్రబలడం అంటే ప్రభుత్వ యంత్రాంతం విఫలం చెందడమే! తాగు నీటిలో మానవ విసర్జితాలు కలవడం, ఆహార పదార్థాలను అమ్మేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కలరా వ్యాపించే ప్రమాదం అధికం. హైదరాబాదు వంటి మహానగరంలో సందుసందుకీ వెలిసే జ్యూస్‌షాపులు పానీయాల పేరుతో నానా చెత్తనీ అందిస్తున్నాయి. కుళ్లిపోయిన పళ్లతో చేసిన పానీయాలలో మురుగునీటితో చేసిన ఐస్ వేసి అందిస్తుంటే... వాటిని మహాభాగ్యంగా సేవిస్తున్నారు జనం. ఇక వీధివీధిలో వెలిసిన చిరుతిళ్ల బళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి అమ్మకాలను పరిశీలించి, నియంత్రించాల్సిన అధికారులు అసలున్నారో లేదో తెలియని దుస్థితి. జనం తీసుకునే ఆహారాన్నే అధికారులు ఇంత లక్షణంగా పట్టించుకుంటుంటే... ఇక నగరంలోని మురుగు పరిస్థితి చెప్పేదేముంది. పరిస్థితులన్నీ ఇంత అనుకూలంగా ఉంటే కలరా రాక తప్పుతుందా!

 

గత పక్షం రోజుల్లోనే పదివరకూ కలరా కేసులు నమోదయ్యాయి. ఇక అనధికారికంగా ఎంతమంది కలరా బారిన పడ్డారో చెప్పడం కష్టం. ప్రపంచ చరిత్రలో కోట్ల మందిని కబళించిన కలరా ఎంత ప్రమాదకారో చాలామందికి తెలియదు. ఈ విషయం తెలిసిన అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు.