చిత్తూరు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర అసంతృప్తి
Published on: Mon Feb 20, 2012 1:19PM
చిత్తూరు
జిల్లా: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ నేతల తీరు, ఆఫ్ ది రికార్డ్ మాటలు, వారి చేతలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. సిఎం పై మంత్రి గల్లా అరుణకుమారి ఇటీవల సోనియాగాంధీకి లేఖరాసినట్లు వచ్చిన వార్తలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను అరుణకుమారి ఖండించినా, ఆమె మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వైఎస్ హయాంలో జిల్లాలో ఆమె హవా నడిచింది. కిరణ్ సిఎం అయ్యాక సొంత జిల్లాలో ఆమె ప్రాభవానికి బ్రేకులు పడ్డాయి. చంద్రగిరి నియోజకవరర్గం తప్ప మిగిలిన వ్యవహారాల్లో ఆమె మాటకు విలువ లేకుండా పోయింది. ఈ పరిణామాలు అరుణకుమారి మద్దతుదారుల్లో ఆగ్రహం తెప్పించాయి. ఆమె కూడా లోలోన తీవ్రంగా మదనపడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలవల్లే ఆమె నేరుగా పార్టీ హైకమాండ్ తో సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించారు.
పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ రెడ్డప్ప రెడ్డి ఇతర సామాజిక వర్గాల వారిని చులకన చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల బహిరంగ యుద్దానికి దిగారు. సిఎం అండదండలతోనే ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నారంటూ పిసిసి అధ్యక్షులు బొత్స దగ్గరకు పంచాయితీ తీసుకువెళ్ళారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమయం దొరికితే సిఎంను దెబ్బతీయడానికి కాసుక్కూర్చున్నారు. తిరుపతిలో అయితే పదవుల పంచకం ప్రతిపాదనల విషయంలో అనేకమంది నేతలు సిఎంపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు. నగరి నియోజకవర్గ నేత ఆర్.చెంగారెడ్డి కొంతకాలంగా జిల్లాపార్టీ వ్యవహారాలతో పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో సిఎం తన అభీష్టాన్ని గౌరవించడంలేదనే అగ్రహంతో ఆయన ఇలా ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ చేతిలో అధికారం ఉండటంతో ఇప్పటికిప్పుడు బైటపడి అసమ్మతిగళం విప్పడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో అందరూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల పంపకాలను పచ్చజెండా ఊపితే ఈ అసంతృప్తి గొంతులు అరుపులు పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


