కామ పిశాచికోసం పోలీస్ వేట
Published on: Wed Feb 29, 2012 11:23AM
చిత్
తూరు: నాలుగు జిల్లాల మహిళలను వణికిస్తున్న ఆగంతకుడు. అతడో కామ పిశాచి. అనేకమంది మహిళలపై అఘాయిత్యం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అతను అకృత్యాలకు పాల్పడ్డాడు. ఇతని కోసం ఒక డిఎస్పీ, ముగ్గురు సిఐలు, ఏడుగురు ఎస్పైలు, 70 మంది కానిస్టేబుళ్ళు వేటసాగిస్తున్నారు. నాలుగు జిల్లాల పోలీసులు సమాచారం ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సమస్వయంతో ఈ కామ పిశాచి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఆగంతకుడి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అతను తలుపులు వేయకుండా పడుకుని ఉండే మహిళలపై అఘాయిత్యం చేస్తుంటాడని, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి అతడు రాడని పోలీసులు అంటున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కామ పిశాచి అయిదడుగుల ఎత్తు, నలుపురంగు కలిగి ఉంటాడు. కొద్దిగా బట్టతల ఉంటుంది. పెద్ద నుదురు, ఎత్తయిన దవడలు, వదులైన దుస్తులు ధరించి కాలినడకన గాని, సైకిల్ పై గాని తిరుగుతుంటాడు. అతను తిరుపతి, నెల్లూరు, కావలి, గుంటూరు, మంగళగిరి, తెనాలి తదితర ప్రాంతాల్లో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. అతనికి ఎవరూ లేరని, ఒంటరిగానే నేరాలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు.


