జగన్‌కు అన్నయ్య జేజేలు.. మరి, తమ్ముడి పరిస్థితేంటి?
Published on: Tue Jun 22, 2021 7:15PM
మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో ఫుల్ బిజీ. పాలిటిక్స్‌తో టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నారు. గత చేదు గాయాలు ఆయన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు సొంత పార్టీతో ఉదయిస్తున్న సూర్యుడిలా ఎదిగారు. అంతలోనే హస్తం పార్టీలో అస్తమించారు. కేంద్ర మంత్రిగా ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడు ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. అన్నయ్య మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నే ఇప్పుడు వినిపించడం లేదు. అంతగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అప్పట్లో చేతులు కాల్చుకున్నాక.. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆకులు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తునే.. జగనన్న ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ఇస్తుండటం ఆసక్తికరం. ఆచార్య మైండ్‌గేమ్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో ఓ పొలిటికల్ రూమర్ హల్‌చల్ చేస్తోంది. చిరంజీవిని సీఎం జగన్ రాజ్యసభకు పంపిస్తారంటూ ప్రచారం హోరెత్తుతోంది. జగన్ ఏంటి.. చిరును ఎంపీ చేయడమేంటి అనే లాజిక్కులు అవసరం లేదు. ఎందుకంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అయితే, ఆ పొగ రావడానికి కారణమైన నిప్పు ఏంటనేదే తేలాల్సింది.
జాగ్రత్తగా గమనిస్తే.. ఇటీవల చిరంజీవి ఏపీ విషయాల్లో బాగా స్పందిస్తున్నారు. సీఎం జగన్‌కు పదే పదే మద్దతు పలుకుతున్నారు. గతంలో ఓసారి సినీ రంగానికి తోడ్పాటు అందించాలంటూ టాలీవుడ్ ప్రతినిధిగా జగన్‌ను కలిసి రిక్వెస్ట్ చేశారు మెగాస్టార్. అయితే, వైజాగ్‌లో స్టూడియో కట్టడానికి భూముల కోసమంటూ రూమర్స్ వచ్చాయనుకోండి అది వేరే విషయం. ఆ తర్వాత కూడా సందర్భానుసారం జగన్ పనితీరును ప్రశంసిస్తూ ఉండటం విశేషం. ఇటీవల కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారాడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందించారు. తాజాగా, ఏపీలో జరిగిన మెగా వ్యాక్సినేషన్‌పైనా జగన్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. అంతకుముందు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిరంజీవి స్పందించారు. ఇటు జగన్‌కు ప్రశంసలు.. అటు ప్రజాసమస్యలపై ప్రతిస్పందనలు.. ఇలా మెగాస్టార్ మళ్లీ ఏపీ పాలిటిక్స్‌కి టచ్‌లోకి వస్తున్నారు.
సీఎం జగన్ సైతం మెగా అండతో మరోసారి అసెంబ్లీ సమరానికి సిద్ధమవ్వాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయానికి అన్ని సామాజిక వర్గాలను తనవైపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎంత కాదన్నా.. చిరంజీవిని, పవన్ కల్యాణ్‌ను కాపు వర్గం నేతలుగానే ప్రజలు భావిస్తారు. వాళ్లు పిలుపిస్తే పోలోమంటూ ముందుండేది కాపు కార్యకర్తలే. ప్రస్తుతం ఆ వర్గమంతా పవన్‌కు మద్దతుగా జనసేన వెంట ఉన్నారు. బీజేపీకి సపోర్టర్స్‌గా మారారు. ఇటు పీకే, అటు సోము వీర్రాజులాంటి నేతల వల్ల కాపులంతా జనసేన-బీజేపీలకు కాపు కాస్తున్నారు. ఆ ఫెవికాల్ బాండ్‌ను బ్రేక్ చేయడం మెగాస్టార్ వల్లే అవుతుందనేది జగన్ లెక్క. లెక్కలేనంత తిక్క ఉన్న పవన్ కల్యాణ్‌కు సైతం అన్నయ్యతోనే చెక్ పెట్టాలనేది వైసీపీ వ్యూహం. అందుకే అందరివాడైన చిరంజీవిని తమ వాడు చేసుకునేందుకు జగన్‌రెడ్డి సై అంటున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి ఫుల్ సపోర్ట్‌గా ఉంది. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ తాయిలాలతో టీడీపీకి బలమైన బీసీలనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక జగన్‌రెడ్డికి కొరకరాని కొయ్యగా మారింది కాపు సామాజిక వర్గమే. అందుకే, ఆ వర్గానికి ప్రతినిధిగా చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపాలనే ఆలోచన చేస్తున్నారట సీఎం జగన్. గతంలో వైఎస్సార్ మద్దతుతో చిరంజీవి పార్లమెంట్‌లో అడుగుపెడితే.. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు జగన్ దయతో మెగాస్టార్ మరోసారి రాజ్యసభ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ మేరకు జగన్ నుంచి వచ్చిన హింట్‌తోనే చిరంజీవి ఈమధ్య కాస్త యాక్టివ్ అయ్యారని అంటున్నారు. అయితే.. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను నొప్పించకుండా జగన్‌తో ఎలా జతకట్టాలనేదే చిరంజీవి ముందున్న అసలు సవాల్.


