తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జయంతి సందర్భంగా పలువురు సినీరాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ ట్వీట్స్ చేశారు.

"ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది సామాన్యులకు అండగా, నిలిచిన మేరునగ ధీరుడు నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ  మార్గదర్శకం. ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం... తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని చాటుదాం." అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

"తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం 
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం 
నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. 
వారితో కలిసి నటించడం నా అదృష్టం. 
పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..." అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

"మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, 
మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, 
పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. 
సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

"సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అన్నది ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ కోసం అందించిన నినాదం కావచ్చు. కానీ అంతకుముందే తన జీవితమంతా ఈ మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్ గారు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా తన వంతు సేవను, సహకారాన్ని అందించిన ప్రజాబంధువు ఎన్టీఆర్. బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమసమాజవాది... పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది. మహిళలకు సమాన హక్కులను కల్పించిన అభ్యుదయవాది.... నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం" అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.