TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ.. సైరా జగన్మోహన్‌రెడ్డి

Published on: Thu Oct 10, 2019 3:29PM

 

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయ ప్రముఖులు కూడా సైరాను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి నారా లోకేష్ వంటి వారు సైరాపై ప్రశంసల వర్షం కురిపించారు.

మరోవైపు చిరంజీవి సినీ రాజకీయ ప్రముఖుల్ని కలిసి సైరా చిత్రాన్ని వీక్షించాలని కోరుతున్నారు. ‘సైరా’ చిత్రాన్ని వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి సైరా చిత్రం చూడమని కోరనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. మరి జగన్ కు సైరా చూసే తీరిక దొరుకుతుందో లేదో తెలియదు కానీ.. చిరంజీవి ఆయనతో భేటీ కాబోతున్నారన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరోవైపు చిరంజీవి జగన్ తో భేటీ అంటున్నారు. దీంతో మెగా అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. అయితే దీని వెనుక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. సైరాకు ఏపీలో అదనపు షోలు కావాలని మంత్రి కన్నబాబు ద్వారా చిరంజీవి అడిగిస్తే.. జగన్ అంగీకరించారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా జగన్ ని కలిసి, కృతఙ్ఞతలు తెలిపి, సైరా వీక్షించాల్సిందిగా కోరనున్నారని సమాచారం.