కాంగ్రెస్ జెండాలను కాల్చి బూడిద చేసిన చిరు అభిమానులు
Published on: Thu Jun 7, 2012 3:55PM
ఇటీవల అనంతపురం జిల్లాకు ప్రచారానికి వచ్చినప్పుడు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయభాస్కరరెడ్డి పై ఫైర్ అయ్యారు. ఆ సమయంలో మంత్రి శైలజానాథ్ మొదలుకుని మిగిలిన నేతలందరూ చిరంజీవికి క్లాసుపీకారు. ఆయన అసహనం తగ్గక అక్కడ నుంచి ప్రచారం మానుకుని తిరిగివెళ్లిపోయారు. ఈ జిల్లాకు పొరుగున ఉన్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రిలో చిరంజీవి మాదిరిగానే ఆయన అభిమానులూ ఫైర్ అయ్యారు. వీరు అసహనంతో కాంగ్రెస్ జెండాలను కాల్చేసి పూలదండలను మంటల్లో పడేశారు. రోడ్డుషోలో భాగంగా చాగలమర్రి వచ్చిన చిరంజీవి తమను ముత్యాలపాడు బస్సుస్టాండు వద్ద కలవలేదన్న కోపంతోనే అభిమానులు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. అభిమానులను కాంగ్రెస్ బాధ్యుడు గంగుల ప్రభాకరరెడ్డి శాంతపరిచారు. ఒకసారి చిరంజీవి ఫైర్, తరువాత అభిమానుల ఆగ్రహం చూసిన కాంగ్రెస్ పార్టీకి 'చిరు' తిప్పలు తప్పేలా లేవని పలువురు వ్యాఖ్యానించారు.


