పాపం శంకర్ దాదా..కాంగ్రెస్ పార్టీ

 

“పాపం! ఈ చిరంజీవికి రాజకీయ అవగాహన ఎప్పటికి కలుగుతుందో.. అసలు ఎప్పటికయినా కలుగుతుందో లేదో...”అని ఆయన ప్రసంగాలు విన్న ప్రతీసారి సీమాంధ్రలో ప్రజలు జాలిపడుతుంటారు. ఆయన గత ఐదేళ్ళుగా రాజకీయాలలోనే ఉన్నప్పటికీ, దేశముదురు కాంగ్రెస్ నేతలతో భుజాలు రాసుకు తిరుగుతున్నపటికీ, ఆయన రాజకీయంగా ఇంకా ‘మెచ్యూర్’ అవలేదని రాజకీయ విశ్లేషకులే కాదు ప్రజలు కూడా భావిస్తున్నారు.

 

మొన్న మచిలీపట్నంలో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నపుడు ఆయన మోడీని హిట్లర్ అన్నందుకు అక్కడి ప్రజలు కొందరు ఆయనని కోడిగుడ్లతో సన్మానం చేసారు. అయినప్పటికీ రోట్లో తల పెట్టిన తరువాత ఇక రోకటి పోటుకి భయపడటం ఎందుకన్నట్లు, కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నపుడు ప్రత్యర్ధులను విమర్శించక తప్పదని, ఈసారి తెదేపా, వైకాపా, బీజేపీలను విమర్శించి తన రాజకీయ అజ్ఞానాన్ని మరో మారు బయటపెట్టుకొన్నారు ఆ మెగాజీవి.

 

తెదేపా-బీజేపీలది అనైతిక బందమని ఆయన విమర్శించారు. అయితే తాము తెరాస, వైకాపాలతో రహస్య ఒప్పందాలు చేసుకొంటే అది నైతికం, తెదేపా-బీజేపీలు బహిరంగంగా పొత్తులు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తుంటే అది అనైతికమని చిరంజీవి చెప్పడం హాస్యాస్పదం. తెదేపా, వైకాపాలకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని ఆయన మరో కొత్త విషయం కనిపెట్టి, దానిని ప్రజలకు చాటి చెప్పారు. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొనే పోటీలో దిగి, ఎన్నికల తరువాత కూడా కలిసేపనిచేస్తామని వారే విస్పష్టంగా చెపుతున్నపుడు, చిరంజీవి ఈ విషయం కొత్తగా కనిపెట్టినట్లు చెప్పడం నవ్వు కలిగిస్తుంది.

 

వైకాపా విషయంలో కూడా తన రాజకీయ అవగాహనా రాహిత్యం ప్రదర్శించుకొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన లగడపాటి, రాయపాటి, కిరణ్ కుమార్ రెడ్డి వంటి అనేకమంది నేతలు తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య రహస్య అవగాహన ఉందని కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్న సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? తెలిసి నటిస్తున్నారనుకోవాలా?

 

అయితే జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పొందేందుకు ఎన్నికల తరువాత ఏ కూటమి అధికారంలోకి వస్తే దానికే మద్దతు తెలుపుతారని ఎవరయినా ఊహించగలరు. అయితే జగన్ ఇప్పుడు మోడీని తిట్టడం లేదు కనుక ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారని చిరంజీవి చెప్పడం చూస్తే, తమ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోదని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయనకు నమ్మకముంటే, తమ పార్టీతో రహస్య అవగాహన ఉన్న జగన్ బీజేపీకి మద్దతు ఇస్తారని చెప్పిఉండరు. కానీ, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదని అర్ధమయిందో ఏమో జగన్ బీజేపీకి మద్దతు ఇస్తాడని ప్రకటించేశారు.

 

ఇక రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంద్రాలో తమ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో స్వయంగా చూస్తూ కూడా ఆయన చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలని, జగన్ కేసుల మాఫీ కోసమే పోరాడుతున్నారని అనడం గురువింజ గింజ సామెత జ్ఞప్తికి తెస్తుంది.

 

ఈసారి ఆంధ్ర, తెలంగాణా మరియు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని దాదాపు ఇప్పటికే ఖరారు అయింది. సీమాంద్రాలో వస్తే తెదేపా లేకపోతే వైకాపాలే అధికారంలోకి వస్తాయి తప్ప కాంగ్రెస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రాదని, రాలేదని సీమాంద్రా అంతటా పర్యటిస్తున్న చిరంజీవికి ఈపాటికి అర్ధమయ్యే ఉండాలి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి అక్కడేదో బావుకొందామని చూస్తే అక్కడా ఏటికి ఎదురీదక తప్పడంలేదిప్పుడు. ఎన్నికల తరువాత మళ్ళీ కేసీఆర్ దయతలిస్తే, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చో , పుచ్చుకోనో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్.

 

ఇదంతా తెలిసి కూడా చిరంజీవి శంకర్ దాదాలాగా ఇంత అమాయకత్వం ఒలకబోసేస్తుంటే ఎవరికయినా నవ్వు రాకమానదు.