చిరంజీవికి ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ తప్పదా

 

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ఆ పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించబడ్డారు. ఇంతవరకు సీమాంద్రాలో కిరణ్, జగన్, చిరంజీవి, చంద్రబాబు తమ తమ పార్టీల తరపున ఏదో ఒక రూపంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వారి మధ్య ఇప్పటికే జోరుగా మాటల యుద్ధం సాగుతోంది. మంచి వక్త, చక్కటి రాజకీయ పరిజ్ఞానం కలిగిన పురందేశ్వరి కూడా రంగంలో దిగినట్లయితే, ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చవచ్చును. కాంగ్రెస్ తరపున ఒక్క చిరంజీవి మాత్రమే కనిపిస్తుంటే, మిగిలిన పార్టీలలో అనేకమంది మంచి వక్తలు, జనాకర్షణ గల నేతలు ఉన్నారు. ఆయన తప్ప ప్రచారంలో పాల్గొంటున్న మిగిలిన వారందరూ హేమాహేమీలే. మంచి రాజకీయ పరిజ్ఞానం, పరిణతి ఉన్నవారే. చివరికి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కంటే ఎక్కువగా ప్రజలను ఆకట్టుకోగలరు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆయన తప్ప ప్రజలను ఆకట్టుకోగల నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమయిన అంశంగా మారబోతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల చాలా మంది నేతలు తెదేపాలో చేరినందున వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవినే లక్ష్యంగా చేసుకొని యుద్దం ప్రకటిస్తే, చిరంజీవి తట్టుకొని నిలబడటం చాలా కష్టమవుతుంది. మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి తనపై చిరంజీవి చేసిన విమర్శలకు బదులిస్తూ తాను గనుక నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెడితే చిరంజీవి ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థతి వస్తుందని చెప్పడం గమనిస్తే, చిరంజీవికి ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ దేరీజే క్రోకడైల్ ఫెస్టివల్ ఉందని అర్ధమవుతోంది.