మెగా సోదరుల మధ్య కూడా కాంగ్రెస్ చిచ్చు

 

కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతకాలంగా అన్నదమ్ములలా కలిసి బ్రతికిన తెలుగుజాతిని రెండుగా చీల్చింది. ఇప్పుడు చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించి, మెగా సోదరుల మధ్య కూడా చిచ్చుపెట్టి వారి కుటుంబాలను, అభిమానులను కూడా రెండుగా చీల్చుతోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్న సంగతి తెలిసి ఉన్నపటికీ, ఆయనను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించితే, దానిని ఆయన అంతే సంతోషంగా మహాప్రసాదమన్నట్లు స్వీకరించడం విశేషమే.

 

కాంగ్రెస్ పార్టీ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉందో చిరంజీవికి తెలిసి ఉన్నపటికీ, ఆయన ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, కేవలం పదవులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇంతకాలం రామలక్షణుల వలే మెలిగిన ఈ మెగా సోదరులిరువురూ ఎన్నికల కురుక్షేత్రంలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోబోతున్నారు. చిరంజీవి సీమాంధ్ర ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ తరపున యుద్ధం చేస్తుంటే, ఆయన సోదరులిరువురూ ఆ వంచింపబడ్డ ప్రజల తరపున నిలబడి పోరాడేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను చీల్చడానికి కూడా వెనుకాడలేదు. అదేవిధంగా చిరంజీవి అధికారం, పదవుల కోసం రక్తం పంచుకొని పుట్టిన సోదరుల మీద, తనకు బ్రహ్మరధం పట్టిన తెలుగు ప్రజలమీద కత్తి కట్టినట్లుగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రజల ముందు రాబోతున్నారు.

 

నిజానికి చిరంజీవి ఇప్పటికయినా తన తప్పుని సరిదిద్దుకొనే అవకాశం సోదరుడు పవన్ కళ్యాణ్ ద్వారా దక్కినపుడు దానిని సద్వినియోగం చేసుకొని ఉండి ఉంటే, ఆయనకు ప్రజలు మళ్ళీ బ్రహ్మ రధం పట్టేవారు. కానీ, తనను ఆదరించి ఆశీర్వదించిన తెలుగు ప్రజల కంటే, తోడబుట్టిన తమ్ముళ్ళ కంటే కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీయే మిన్న అని ఆయన అనుకొంటున్నారు. ఆమెను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొంటే తనకు తప్పకుండా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో ఓడిపోతే తన పరిస్థితి ఏమిటనేది ఆయన ఆలోచించుకొన్నారో లేదో ఆయనకే తెలియాలి.

 

ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెగా సోదరుల మధ్య చిచ్చుపెట్టి వినోదం చూస్తోందని భావించవచ్చును.అయితే, అందుకు కాంగ్రెస్ నే కాదు చిరంజీవిని కూడా నిందించక తప్పదు.