గంటాది సమైక్య రాగం, మరి చిరంజీవిది?

 

చిరంజీవికి భుజకీర్తుల వంటి వారెవరని అడిగితే, రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులని ఎవరయినా టక్కున తడుముకోకుండా చెప్పేస్తారు. మరి చిరంజీవి రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు, అయన అనుచరుడు రామచంద్రయ్య మౌనం దాల్చగా, మరో అనుచరుడు గంటా మాత్రం ఎందుకు సమైక్య గానం చేస్తున్నట్లు? అంటే ఆయన చిరంజీవిని కాదని ముందుకు వెళ్తున్నాడా? లేక స్వతహాగా సమైక్యవాదయిన చిరంజీవే ఆయనను వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారా? ఒక వేళ చిరంజీవి ప్రోత్సహిస్తున్నారనుకొంటే మరప్పుడు రామచంద్రయ్య కూడా సమైక్య రాగం ఆలపించాలి కదా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే డొంక కదులుతుంది.

 

కొద్ది వారాల క్రితం రామచంద్రయ్య విశాఖలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “రానున్నఎన్నికలలో, ఆ తరువాత కూడా బొత్సతో కలిసి చిరంజీవే చక్రం తిప్పుతాడని, చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నిఅర్హతలు ఉన్నాయని” భజన చేసినప్పటి నుండి చిరంజీవికి కిరణ్ కుమార్ కి కొంత చెడిందని, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసినప్పుడు కూడా రామచంద్రయ్యను వెనకేసుకు రావడంతో వారి మధ్య మరికొంత అగాధం ఏర్పడిందని సమాచారం. ఇక చిరంజీవి కిరణ్ కుమార్ కి వ్యతిరేఖంగా అధిష్టానానికి లేఖ వ్రాయడం కూడా వారి మధ్య భేదాభిప్రాయాలకు మరో కారణంగా చెప్పబడుతోంది.

 

ఆ కారణంగానే గంటా శ్రీనివాసరావు సమైక్య రాగం తీసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తూ, చిరంజీవిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా గంటా శ్రీనివాసరావు కూడా క్రమంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపుకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. అందువల్లే చిరంజీవి కూడా శ్రీనివాసరావుకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.