ముఖ్యమంత్రికి చిరంజీవి లేఖాస్త్రం
Published on: Tue Apr 10, 2012 11:02AM
హైదరా
బాద్: మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. అధికార కాంగ్రెసులో పూర్తిగా కలిసిపోయిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష పాత్రనే పోషించాలని అనుకుంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఆయన సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విద్యుత్ చార్జీల పెంపు పార్టీకి, ప్రభుత్వానికి ఏ విధమైన మేలు చేయదని ఆయన అన్నారు. పెంచిన చార్జీలను తగ్గించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సి) నిర్ణయం మేరకే చార్జీలు పెరిగాయని చెప్తే ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని ఆయన అన్నారు.
విద్యుత్ చార్జీల పెంపు కొన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు మాత్రమే ఈ లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ చిరంజీవి లేఖ రాయడంలోని ఆంతర్యంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవలి కాలంలో చిరంజీవిని కాంగ్రెసు నాయకులు విస్మరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలోనే చిరంజీవి ముఖ్యమంత్రికి లేఖాస్త్రం సంధించినట్లు తెలుస్తోంది.


