చిరంజీవికి రాజ్యసభ, సురేఖకు తిరుపతి?
Published on: Sat Mar 10, 2012 1:01PM
హైదరా
బాద్: మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర రాజకీయాలు రోతపుట్టిస్తున్నాయి. అందుకే ఆయన జాతీయస్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఆయన రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిసింది. పిఆర్పీ సంఖ్యాబలంతో ఇటీవల ప్రభుత్వాన్ని కాపాడుకున్న కిరణ్ కూడా చిరు కోర్కెను మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. తనకు రాజ్యసభ టిక్కెట్ ఖరారయిన తరువాత తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ ను తన భార్య సురేఖకు కేటాయించాలని ఆయన కోరడం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన తిరుపతి అసెంబ్లీ స్థానంలో సంబంధం బాంధవ్యాలను తెంచుకోవడం ఇష్టం లేదని అందుకే తన భార్యకు ఆ టిక్కెట్ ను కేటాయించాలని చిరంజీవి కోరుతున్నట్లు తెలిసింది. నిజానికి చిరంజీవి రాజ్యసభకు వెళితే తిరుపతిలో ఖాళీ అయ్యే స్థానంకోసం చిత్తూరు జిల్లాకు చెందిన చాలామంది నాయకులు కాసుకు కూర్చున్నారు. మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ రాజకీయాల్లో చేరడానికి చాలా ఉబలాటపడుతున్నాడు. ఒకవేళ చిరంజీవి రాజ్యసభకు వెళితే తాను గుంటూరు నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని గల్లా జయదేవ్ తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. తిరుపతి నుంచి పోటీ చేస్తే తాను తేలికగా గెలవగలనని ఆయన భావిస్తున్నారు. గల్లా జయదేవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, శంకరరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన శంకరరెడ్డి గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. తిరుపతి రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న శంకర్ రెడ్డికి నగర ప్రజలతో మంచి పరిచయాలున్నాయి. అక్కడ ఆయనకు ఒక బలమైన వర్గం కూడా ఉంది. అందువల్ల ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇస్తే తిరుపతి నుంచి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు.


