చిరు,బాలయ్య యుద్ధం :అభిమానుల మధ్య ఘర్షణ
Published on: Wed Jan 25, 2012 7:56AM
తిరుప
తి: కాంగ్రెసు శాసనసభ్యుడు మెగాస్టార్ చిరంజీవికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణకు మధ్య మాటల యుద్ధం ఇరు పక్షాలకు మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య తిరుపతిలో ఘర్షణ ప్రారంభమై, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద బాలయ్య అబిమానులు, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పక్షాలు పరస్పరం దాడులకు దిగాయి.ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఇరు వర్గాలు రెండు వైపులా మోహరించి ఉన్నాయి. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. చిరంజీవి, బాలకృష్ణ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ మాటల యుద్ధం ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది.
కాగా ఈ చిచ్చు క్రమంగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు చిరంజీవిని సమర్థిస్తూ బాలయ్యను దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగుదేశం నాయకులు బాలయ్యను సమర్థిస్తూ చిరంజీవిని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో ఇలా పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం మామూలే. కానీ ఇరువురు సినీ ప్రపంచంలో అగ్ర హీరోలు కావడంతో అభిమానులు రెండుగా చీలిపోయి ఘర్షణకు దిగే వాతావరణం ఏర్పడింది. నిజానికి, సినీ రంగంలోనూ ఇరువురికి పడదనే విషయం అందరికీ తెలుసు. కానీ, అది రాజకీయ రంగానికి కూడా పాకింది. వారిద్దరి మధ్య సాగుతూ వచ్చిన ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా రాజకీయంలో బహిరంగ సమరంగా మారింది. నెల్లూరు, తిరుపతిల్లో ఇరువురు హీరోల అబిమానులు రెండుగా చీలిపోయి, రోడ్ల మీదికి వచ్చి ఘర్షణ పడ్డారు. చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అభిమానులు నెల్లూరులోని శ్రీ వివేకానంద సెంటర్లో బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం తోసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు బాలయ్య అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు పోటా పోటీగా నినాదాలు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి.


