పదవి ఇస్తే ఇవ్వండి: కావూరి
Published on: Mon Dec 26, 2011 2:23PM
హై
దరాబాద్: తాను మెగాస్టార్ చిరంజీవికి మంత్రి పదవి ఇస్తానంటే తాను అడ్డుకోలేదని, తాను ఎవరికీ మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోలేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు స్పష్టం చేశారు. చిరంజీవికి మంత్రి పదవి ఇస్తామంటే తాను అడ్డుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అయన స్పష్టం చేశారు. చిరంజీవికి మంత్రి పదవి ఇస్తే తనకు అభ్యంతరం లేదని, అయితే కాంగ్రెసు సీనియర్లకు కూడా పదవులు ఇవ్వాలని ఆయన అన్నారు. చిరంజీవి అంటే తనకు కూడా అభిమానమేనని, చిరంజీవితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఉంటే వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని, నిర్ణయాల విషయంలో ఏకాభిప్రాయ సాధనకే సమన్వయ కమిటీ పనిచేస్తుందని ఆయన చెప్పారు. సమన్వయ కమిటీ పార్టీ బలోపేతానికి పని చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యను ఇప్పట్లో తేల్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. జగన్ను ఎదుర్కోవడమే కాంగ్రెసు పనా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో జగన్ పెద్ద సమస్య కారని ఆయన అన్నారు.


