బేగంపేటలో 145 ఏళ్ల వారసత్వం కట్టడం కూల్చివేత!
Published on: Tue Apr 7, 2026 5:15PM

హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఒకప్పుడు రాజసంతో మెరిసిన ఈ చారిత్రక భవనం ఇప్పుడు కూల్చివేత శబ్దాలతో కంపిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ గ్రేడ్–II రక్షిత రాజభవనాన్ని ఒక నిర్మాణ సంస్థ కార్యాలయం కోసం కూల్చివేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయం బయటపడటంతో వారసత్వ పరిరక్షణపై తీవ్ర చర్చ మొదలైంది.పైగాహ్ వంశానికి చెందిన ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
పాలిస్ లోని ఒక భాగంలో నివసిస్తున్న రెహ్మన్ మాట్లాడుతూ... శనివారం రోజు ఒక నిర్మాణ సంస్థ కార్యాలయం కోసం బేగంపేట్ లోని 145 సంవత్సరాల చరిత్ర గల చిరాన్ ఫోర్డ్ క్లబ్ భవనంలోని పలు నిర్మాణాలను తొలగిస్తూ స్థలం ఖాళీ చేసే పనులు వేగంగా సాగాయని తెలిపారు. “చిరాన్ ప్యాలెస్ తలుపులు ఇప్పటికే తీసేశారు… త్వరలో మొత్తం భవనం నేలమట్టం కావచ్చు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.1980ల నుంచి నగర ప్రముఖులకు వినోద కేంద్రంగా ఉన్న క్లబ్ ప్రస్తుతం మూసివేయబడిందని తెలిపారు. ఒకప్పుడు చరిత్రను మోసు కొచ్చిన ఈ భవనం భవిష్యత్తు ఏమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు నగరవాసుల ముందుంది.


