TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతా సమాన‌మే!.. సూక్తులు కాదు, చేసి చూపిస్తే బాగుండేది సామీ!

Published on: Fri Feb 18, 2022 4:31PM

శ్రీ రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతానికి స‌హ‌క‌రించిన అందరినీ చిన‌జీయ‌ర్ స్వామి అభినందించారు. చివ‌రి ఘ‌ట్టం శాంతి క‌ల్యాణానికి అంద‌రూ ఆహ్వానితులే అన్నారు. ఈ సంద‌ర్భంగా.. ప్ర‌తిప‌క్షాల‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ఆయ‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, సీఎం కేసీఆర్‌తో విభేదాల‌కూ బ‌దులిచ్చారు. సీఎం కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవన్నారు.. రాజకీయాల్లోనే ప్రతిపక్షాలుంటాయి.. భగవంతుడి ద‌గ్గ‌ర‌ కాదన్నారు చినజీయర్‌ స్వామి. 

దేవుడికి పూజ, యాగం వంటివి జరిగే చోట ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదు.. అని సెల‌విచ్చారు చిన‌జీయ‌ర్ స్వామి. అవునా.. ఆ ఆహ్వానం కేవ‌లం ప్ర‌తిప‌క్షాల‌కు మాత్ర‌మే అక్క‌ర్లేదా? మీకు కావ‌ల‌సిన, మీరు రావాల‌నుకున్న వారంద‌రి గ‌డ‌ప‌లు తొక్కి మ‌రీ స్వ‌యంగా ఆహ్వానించారుగా.. అని గుర్తు చేస్తున్నారు విమ‌ర్శ‌కులు. పీఎం మోదీ నుంచి ప‌లు రాష్ట్రాల సీఎంల వ‌ర‌కూ.. చిన‌జీయ‌రే ప్ర‌త్యేకంగా ఇన్‌వైట్ చేశారు. ఇక‌, ముచ్చింత‌ల్ వ‌చ్చిన ఆ అధికార‌ ప్ర‌ముఖులంద‌రినీ తెగ పొగిడేశారు. మోదీనైతే ఏకంగా శ్రీరామునితో పోల్చేశారు. క‌శ్మీర్ అంశాన్నీ ప్ర‌స్తావిస్తూ హీరోగా కీర్తించారు. అమిత్‌షానూ ఆకాశానికెత్తేశారు. ఏం ఘ‌న‌కార్యం చేశార‌నో.. సీఎం జ‌గ‌న్‌కూ భ‌జ‌న చేసేశారు. కేసీఆర్ రాకున్నా.. అసంద‌ర్భంగా క‌ల్పించుకొని మ‌రీ ప్ర‌శంసించేశారు. ఈయ‌న స్వామీజీనా..? ఇదేంటి.. భ‌ట్రాజులా అలా అంద‌రినీ పొగుడుతున్నారేంటి? అనే డౌట్ వ‌చ్చేలా చేశారు. 

అదంతా స‌రే కానీ.. రామానుజుల స‌హ‌స్రాబ్ది స‌మారోహ‌ణ కార్య‌క్ర‌మానికి అతిథిగా హాజ‌రు కావాలంటే అధికారంలో ఉన్న‌వారే అర్హులా? ప్ర‌తిప‌క్షాల‌కు స్వామీజీ త‌ర‌ఫున ఎలాంటి ఆహ్వానం ఉండ‌దా? అనే విమ‌ర్శ‌లు బాగా వినిపించాయి. స‌మ‌తాస్పూర్తి అని చెబుతూనే.. ఆ స‌మ‌తాస్పూర్తికే తూట్లు పొడిచేలా ప్ర‌వ‌ర్తించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. విప‌క్షాల నుంచి ఏ ఒక్క నాయ‌కుడికీ ఆ రామానుజుల చెంత స్థానం ల‌భించ‌లేదు..క‌ల్పించ‌లేదు. కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికార ప‌క్షానికి మాత్ర‌మే అత్యంత ప్రాధాన్యం క‌ల్పించారు. బీజేపీ డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపించిందనే ఆరోప‌ణ ఉంది. రాహుల్‌గాంధీని కానీ, రేవంత్‌రెడ్డిని కానీ.. క‌నీసం చంద్ర‌బాబునాయుడుకి సైతం రామానుజుల కార్య‌క్ర‌మంలో స్థానం లేకుండా చేశారు ఈ స్వామీజీ అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇదేదో అంద‌రి కార్య‌క్ర‌మం కాకుండా.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లా నిర్వ‌హించార‌ని అన్నారు.

ఈ ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు వివ‌ర‌ణ చిన‌జీయ‌ర్ వివ‌ర‌ణ ఇస్తూ.. ప్రతిపక్షాలు, స్వపక్షాలు, ప్రభుత్వాలు.. ఇలా మాకు భేదాలు ఉండవు. ప్రజా సేవలో ఉండే ప్రతి ఒక్కరికి సమతాస్ఫూర్తి ఉండాలి. మేం ప్రతి ఒక్కరినీ పిలిచాం. ప్రతిపక్షాలు కేవలం రాజకీయాల్లోనే ఉంటాయి.. భగవంతుడి వద్ద కాదు. దేవుడికి పూజ, యాగం వంటివి జరిగే చోట ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదు.. అని స్వామిజీ సెల‌విచ్చారు. 

ఇక‌, చిన‌జీయ‌ర్‌తో కేసీఆర్‌కు బాగా చెడింద‌ని..మండింద‌ని తెలిసిపోతోంది. ప్ర‌ధాని మోదీ సంద‌ర్శ‌న స‌మ‌యంలో ఆయ‌న‌తో విభేదాల కార‌ణంగా ఆ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఇక‌, ఆ టైమ్‌లో మోదీని చిన‌జీయ‌ర్ అంత‌లా పొగ‌డ‌టం.. క‌నీసం శిలాఫ‌ల‌కంపై త‌న పేరు కూడా వేయ‌క‌పోవ‌డం.. కేసీఆర్‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. ఇక‌, ముచ్చింత‌ల్ వైపు క‌న్నెత్తి చూస్తే ఒట్టు. శిలాఫ‌ల‌కాన్ని అప్ప‌టిక‌ప్పుడు మార్చేసి.. కేసీఆర్ పేరు చెక్కించినా.. ఆయ‌న అల‌క వీడ‌లేదు.. ఆగ్ర‌హం త‌గ్గ‌లేదు. పూర్ణాహుతికి వెళ్ల‌లేదు. కేసీఆర్‌కు న‌చ్చ‌చెప్పేందుకే.. ఎప్పుడో జ‌ర‌గాల్సిన శాంతి క‌ల్యాణాన్ని సైతం శుక్ర‌వారానికి వాయిదా వేశార‌ని అంటున్నారు. ముక్కోపి అయిన కేసీఆర్‌.. చిన‌జీయ‌ర్‌, మైహోం రామేశ్వ‌ర్‌రావుల మెత్త‌టి మాట‌ల‌కు క‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. అయితే, స్వామీజీ మాత్రం కేసీఆర్‌తో త‌మ‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని అంటున్నా.. ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన పూర్తి సహకారం అందించారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే మొదటి వాలంటీర్‌ని అని చెప్పారు. ఆరోగ్యం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా ఆయన రాలేకపోయి ఉంటారు. సీఎం కేసీఆర్‌ని కూడా శాంతి కల్యాణానికి ఆహ్వానిస్తున్నాం.. అన్నారు చిన‌జీయ‌ర్ స్వామి.