టీడీపీ నేతల తీరును తప్పుబట్టిన చినరాజప్ప

పలువురు టీడీపీ నేతల తీరును ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చినరాజప్ప తప్పుబట్టారు. రెండో రోజు మ‌హానాడులో భాగంగా పార్టీ సంస్థాగత తీరు తెన్నులపై చినరాజప్ప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు నేతల తీరును తప్పుబట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని, ప్రభుత్వంలో లేకుంటే పార్టీ గురించి పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఎవ‌రు ఏ విధంగా వ్వ‌వ‌హారిస్తున్నారో గ‌మ‌నించాలని, బాగా పని చేస్తున్న వాళ్లనే చంద్రబాబు ప్రమోట్ చేయాలని సూచించారు. 

మనం చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోయామని అన్నారు. కార్యకర్తలను చూసుకోవాలని అధినేత చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని, దాంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారని అందువల్లే టీడీపీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారం కోల్పోగానే కొందరు నేతలు వెళ్లిపోయారని, వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. వెళ్లిపోయిన నేతలు ఇప్పుడు కనుమరుగయ్యారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని చినరాజప్ప చెప్పారు.