ఇస్లాంపై చైనా ఆల్టీమేటం..

తమ దేశంలో ఇస్లాం మతాన్ని అనుసరించే వారికి చైనా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లాం మతాన్ని అనుసరించడం మానుకుని..దేశ అధికార విధానమైన మార్క్సిస్ట్ నాస్తిక వాదానికి కట్టుబడి ఉండాలని చైనా ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా కల్లోలిత జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఇస్లాం మతాన్ని అనుసరించడం  మానుకోవాలని పేర్కొంది. మతంపై జాతీయ సదస్సులో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, దేశాధ్యక్షుడు గ్లి జింగ్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్య ఆసియాలో పదిలక్షల చదరపు మైళ్ల పైన విస్తరించిన ప్రాంతాన్ని క్రీశ.8వ శతాబ్ధిలో ముస్లింలు ఆక్రమించి ఈ ప్రాంతానికి టర్కిస్థాన్ అని పేరు పెట్టుకున్నారు. కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని చైనీయులు, రష్యన్లు ఆక్రమించారు. తూర్పు టర్కిస్థాన్‌ను చైనా ఆక్రమించింది.

 

బ్రిటిష్ వారు సికియాంగ్‌గా పిలిచిన ఈ ప్రాంతాన్ని చైనీయులు "జింజియాంగ్ ఉయిఘర్" ప్రాంతంగా పిలుస్తున్నారు. సింకియాంగ్‌పై చైనా దురాక్రమణ సాగుతోందని భావిస్తున్న అక్కడి వారు మళ్లీ ఈ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా రూపొందించాలన్న లక్ష్యంతో  బీభత్సకాండను సృష్ఠిస్తున్నారు అదే "ఉయిఘర్ ఉద్యమం". దీనిని చైనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడానికి దశాబ్ధాలుగా ప్రయత్నిస్తోంది. జిహాదీ టెర్రరిస్టులన్న సాకుతో అమాయక ముస్లిం ప్రజలను సైతం సైనిక దళాలు, పోలీసులు భారీగా మట్టుపెట్టినట్టు ఆరోపణలు వెల్లు వెత్తాయి. దాంతో పాటు జిహాదీలకు స్థావరాలుగా ఉన్న కారణంతో మసీదుల్లోకి చోరబడి గాలింపు చర్యలు చేపట్టి మసీదులను సైతం నేలమట్టం చేశారు. క్రమేపి ఇక్కడ ప్రభుత్వానికి, ఆందోళనకారులకు మధ్య యుద్ధం జరుగుతుండటంతో జింజియాంగ్ ప్రొవిన్స్‌లోని చాలా ప్రాంతాల్లో అతివాదం పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి తీవ్రతను చైనా ప్రభుత్వం కూడా గుర్తించింది. చైనా ప్రజలు "బౌద్ధమతాన్ని" అధికసంఖ్యలో అనుసరిస్తారు. అది ఇష్టం లేని వారు "మార్క్సిస్ట్ నాస్తిక వాదాన్ని" విశ్వసిస్తారు. ప్రస్తుతం జింజియాంగ్‌ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలంటే అణచివేత ఒక్కటే మార్గం కాదన్న నిర్ణయానికి వచ్చిన చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ మతం విషయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.