ఏపీలో గూఢచారి పావురం? హై అలర్ట్..

posted on: Jan 5, 2022 10:55AM

రాజుల కాలంలో గూఢచర్యం కోసం గతంలో పావురాలను ఉపయోగించేవారని చదువుకున్నాం. పావురాలను వందల కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రదేశంలో వదిలేసినా అవి ఎక్కడి నుంచి వెళ్లాయో తిరిగి అక్కడికి చేరుకోగలవు. తమ శత్రు దేశపు రహస్యాలను తెలుసుకునేందుకు పావులరాలను ఉపయోగించేవారు. రాయాబారాలకు కూడా పావురాలను వాడేవారు గతంలో. తాజాగా అలాంటి పావురాలే కనిపిస్తుండటం కలకలం రేపుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా  చీమకుర్తిలో ఓ పావురం కలకలం రేపింది. కాళ్లకి చైనాకి సంబంధించిన ట్యాగ్‌తో ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు. పావురం కుడికాలుకి పసుపు రంగుతో ఉన్న ట్యాగ్‌ను గమనించారు. ట్యాగ్‌పై AIR 2207 అనే కోడ్ నంబర్ ఉంది. అయితే ఇది చైనా పావురం అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా పావురాలు స్థానికులకు చిక్కాయి. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని రవురెక్కలా ప్రాంతంలోనూ.. మంగళవారం కేంద్రపడ జిల్లా మార్ సగై పోలీస్ స్టేషన్‌ పరిధి దశరథపుర్‌లో మరోటి దొరికాయి. వీటిలో ఒక పావురం కాలికి వీహెచ్ఎఫ్, వైజాగ్, 19742021 అని ముద్రించి ఉండగా.. మరో పావురం కాలికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్ ఉన్నాయి. 

సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయంతో ఓ పావురం కింద పడిపోయింది. ఆ పావురాన్ని రక్షించేందుకు సర్బేశ్వర్ చొత్రాయ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కాలికి చైనా ట్యాగ్ ఉన్నట్లు అతడు గుర్తించాడు. దానిపై చైనీస్ భాషలో అక్షరాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అధికారులు హూటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

పూరీ-కోణార్క్ మార్గంలో అనుమానాస్పదంగా మరో పావురం కనిపించింది. దీని రెండు కాళ్లపై రింగులు ఉండగా.. కోడ్ భాషలో సీరియల్ నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ పక్షులను గూఢచర్యానికి చైనీయులు ఉపయోగిస్తున్నారని అనుమానం కలుగుతోందని పూరీకి చెందిన అలోక్ పాలేయ్ అన్నారు. కాళ్లకు అమర్చిన రింగులపై ఉన్న కొండ గుర్తులు చూస్తే ఇవి చైనా గూఢచారి పావురాలేనని అర్ధమవుతోందని తెలిపారు. అయితే  పావురం కాలికి ఉన్న బ్యాడ్జ్‌లపై ఎటువంటి అక్షరాలు, కెమెరా, ఎలక్ట్రానిక్ పరికరాలు, చిప్‌లు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, స్థానికులు కూడా కొన్నిసార్లు తమ పక్షులను గుర్తించడానికి కొన్ని బ్యాడ్జ్‌లను పెడుతుంటారని తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...