నక్కలా యుద్ధానికి రెడీ అవుతోన్న డ్రాగన్!

 

మన శత్రువు పాకిస్తాన్ కాదు చైనాయే! ఈ మాటలన్నది గతంలో రక్షణ శాఖ మంత్రిగా పని చేసిన ములాయం సింగ్ యాదవ్. నిజంగా పాకిస్తాన్ మనకు శత్రువు కాదా? అలా చెప్పలేం. కాని, పాకిస్తాన్ కంటే పెద్ద శత్రువు, ప్రమాదకర శత్రువు చైనా! ఇది మాత్రం నిస్సందేహం! గతంలో ప్రోక్రాన్ అణు పరీక్షలు జరిపిన తరువాత కూడా అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ఇలాంటి మాటే చెప్పారు. అణు పరీక్షలు పాక్ ను ఉద్దేశించి కాదనీ… చైనాను దృష్టిలో పెట్టుకునేనని… ఆయన చెప్పారు!

 

గ్రౌండ్ లెవల్లో డ్రాగన్ చేస్తోన్న సన్నాహాలు చూస్తుంటే చైనా ఎందుకు ప్రధాన శత్రువో తేలిగ్గా అర్థమైపోతుంది ఎవరికైనా. తాజా మీడియా రిపోర్ట్స్ ని బట్టి చూస్తే చైనా ఇప్పటికే వేల టన్నుల యుద్ధ సామాగ్రి టిబెట్ లోకి తరలించింది. హాంకాంగ్ బేస్డ్ గా పబ్లిష్ అవుతున్నో చైనా అధికార పత్రిక కథనం ప్రకారం, ఆ దేశ మిలటరీ పశ్చిమ సరిహధ్దులో యుద్ధానికి సర్వ సన్నద్ధంగా వుంది. చైనా దేశ పశ్చిమ సైన్య విభాగం ఇండియాతో బార్డర్ వ్యవహారాల్ని చూసుకుంటుంది. అటువంటి వెస్టన్ థియేటర్ కమాండ్ ఇప్పుడు వార్ మూడ్ లో వుందంటే అర్థం ఏంటి? అంతే కాక జూన్ లో ఒకవైపు ఆర్మీని సన్నద్ధం చేసుకుంటూనే చైనా మనల్ని సిక్కింలో కవ్వించింది. ఇంకో వైపు టిబెట్ లోని పలు కీలక మిలటరీ బేస్ లలో యుద్ధ విన్యాసాలు చేసింది. మొత్తంగా భారత్ కు గట్టి యుద్ధ సంకేతాలు పంపటమే చైనా లక్షంగా పెట్టుకుంది. అందులో విజయవంతం కూడా అయింది. మరీ బరితెగించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ తో చైనా ప్రతినిధి భేటీ కూడా అయ్యారు. అంటే…. చైనా కుట్రలు సరిహద్దుల వద్ద, దిల్లీలోనూ హద్దులు మీరుతున్నాయి.

 

చైనా ఇప్పటికిప్పుడు యుద్దానికి ఎందుకు ఉవ్విళ్లూరుతుంది? లోలోన ఇండియాతో వారంటే చైనాకూ ఆందోళనే. తైవాన్, వియత్నాం, ఫిలప్పీన్స్ లాంటి డ్రాగన్ మాట వినని దేశాల్నే బీజింగ్ ఏం చేయలేకపోతోంది. అటువంటిది… ప్రపంచంలో చైనాకు ధీటుగా ఎదుగుతోన్న భారత్ అంటే కమ్యూనిస్టు దేశానికి ఎంత మాత్రం సహించదు. పైగా మోదీ పాలన మొదలయ్యాక అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు ఇండియా ఎప్పుడూ లేనంత దగ్గరవుతోంది. ఈ పరిణామం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. ఆ చికాకుతోనే చైనా యుద్ధం పేరుతో భయపెట్టే కార్యక్రమానికి తెర తీసింది. కాని, సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో మన ఆర్మీ, చైనా సైనికులు ముఖాముఖి ఎదురుకాక ముందే యుద్దానికి ఏర్పాట్లు పూర్తైనా… చైనా ఎందుకని యుద్ధం మొదలు పెట్టలేదు? దీంట్లోనే మతలబు వుంది! రకరకాల ఏర్పాట్లు, చిన్న చిన్న గొడవలతో యుద్ధ వాతావరణం సృష్టించి భారత్ ను బెంబేలెత్తించటమే చైనా వ్యూహం. అంతకుమించి ప్రత్యక్ష దాడులకి దిగుతుందా అంటే చాలా చాలా అనుమానమే!

 

యుద్ధం జరిగే సూచనలు మరీ స్పష్టంగా లేకున్నా ఇండియా మాత్రం జాగ్రత్తగా వుండాల్సిందే. చైనా యుద్ధం మొదలు పెడితే పాకిస్తాన్ కూడా రెచ్చిపోయే అవకాశం వుంది. అసలు గత కొన్ని నెలలుగా అదే పనిగా కాల్పుల ఉల్లంఘన చేస్తోన్ పాక్ వ్యూహం భారత ఆర్మీని బిజీగా వుంచటమే అయి వుండవచ్చ. ఆ విధంగా ఇండియా చైనాను పట్టించుకోకపోతే హఠాత్తుగా చైనా దాడి చేసే అవకాశమూ వుంది. కాబట్టి మోదీ ఇప్పుడు చైనాను, అదే స్థాయిలో పాక్ ను కనిపెట్టాలి. యుద్ధం అనివార్యమైతే రెండు దేశాలతో మనం పోరాడాల్సి వుంటుందని గుర్తించి వ్యూహాలు సిద్ధం చేయాలి…