భారత దౌత్యం వలనే చైనా దళాలు వెనక్కి మళ్లాయా?

 

గత నెల 15వ తేదీన 50మంది చైనా సైనికులు 19కి.మీ. మేర భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఉభయ దేశాల సైనిక దళాల కమాండర్ల మద్య అనేక దఫాలుగా ఫ్లాగ్ మీటింగ్స్ జరిగిన తరువాత ఎట్టకేలకు రెండు రోజుల క్రితం వారు వెనక్కి మళ్ళారు. ఇది భారత దౌత్య విజయమని కొందరు మేధావులు అభివర్ణిస్తే, మరి కొందరు ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరలో జరుపనున్న తన ఒక్క రోజు జపాన్ పర్యటనను మరో రోజుకి పొడిగించడం ద్వారా చైనాపై ఒత్తిడి తెచ్చినందునే వారు వెనక్కి తగ్గాల్సివచ్చిందని విశ్లేషించారు. జపాన్ సముద్రజలాలలో ఉన్న కొన్ని ద్వీపాల కోసం చైనా ఆ దేశంతో కూడా చాలా రోజులుగా ఖయ్యానికి కాలు దువ్వుతున్నందున, ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనను మరొక రోజు పొడిగించడం ద్వారా, తాము జపాన్ కు మద్దతు తెలుపుతామని సూచించినట్లయింది కనుక, చైనా కాళ్ళ బేరానికి వచ్చి తన సైనికులను వెనక్కి తీసుకొందని సామాన్యులకు అర్ధం కాని ఒక మంచి లాజిక్ పాయింటు వివరించడంతో అల్పసంతోషులయిన భారతీయులు కూడా చాలా సంతోషించారు.

 

కానీ, ఉత్తర సైనిక కమాండ్ కు చెందిన ఒక సైనికాధికారి చెప్పిన కధ వింటే మాత్రం భారతీయులు ఉసూరుమనక మానరు.

 

ఐదు రోజుల క్రితం ఉభయ దేశాల సైనిక దళాల కమాండర్ల మద్య జరిగిన ఆఖరు ఫ్లాగ్ మీటింగ్ లో మన దేశ సరిహద్దుల్లో చుమార్ అనే ప్రాంతంలో మన సైనికులు గస్తీ కోసం నిర్మించిన బంకర్లను పూర్తిగా తొలగిస్తేనే తాము వెనక్కి వెళ్తామని స్పష్టం చేయడంతో, తప్పని పరిస్థితిలో చైనా షరతులకు భారత్ తలఒగ్గిన తరువాతనే వారు వెనక్కి మళ్లారని ఆయన తెలిపారు. వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు చైనా సైనికులు భారత భూభాగంలోనే నిలబడి “మీరు మా భూ భాగంలోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్ళిపొండి” అనే ఒక ఎర్ర బ్యానరు చాల సేపు పట్టుకొని మన సైనికులకు ప్రదర్శించిన తరువాతనే వెనక్కి మళ్ళారు. అని తెలిపారు. దీనినేనా మన దౌత్యవిజయంగా అభివర్ణిస్తున్నారు?