చైనాలో బయట పడ్డ మరో కొత్త జబ్బు

కరోనా వైరస్ ను ప్రపంచానికి వ్యాపింప జేసిన చైనాలో మరో ఉపద్రవం ముంచుకు వస్తుంది. వాయువ్య చైనాలో బ్రూసె ల్లోసిస్   అనే బ్యాక్టీరియా ద్వారా కొన్నివేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా మగవారి శరీరభాగాల్లో వాపు, వృషణాలు ఎర్రబడటం, సంతాన హీనత వంటి దీర్ఖకాలిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. శుభ్రత లేని ఆహారం తీసుకున్నప్పుడు ఇది మనుషుల్లో కి వ్యాపించి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా మారుతుందని గన్సు ప్రావిన్స్  రాజధాని నగరం లాన్జౌ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. వారి లెక్కల ప్రకారం  3,245 మందికి ఈ వ్యాధి సోకింది. చైనాలో వేలాది మంది పురుషులను వంధ్యత్వానికి గురిచేసే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడింది. చైనాలో  పశువులపై ఉండే బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వాయువ్య చైనాలో అనేక వేల మంది ప్రజల్లో బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాధికి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చైనా అధికారులు ధృవీకరించారు. పరీక్షలు నిర్వహించిన 21వేల మందిలో 3245 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని  చెప్పారు.

బ్రూసెల్లోసిస్  బ్యాక్టీరియా సోకిన వారిలో  వచ్చే అనారోగ్యాన్ని మాల్ట ఫీవర్ లేదా మెడిటేరియన్ ఫీవర్ గా పిలుస్తారు.  తలనొప్పి, కండరాల నొప్పులు,  జ్వరం,  అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. ఈ లక్షణాలు చికిత్స తర్వాత తగ్గినప్పటికీ వ్యాధి సోకిన వారు దీర్ఘకాలంలో ఆర్థరైటిస్, కొన్ని అవయవాలలో ముఖ్యంగా వృషణాలు వాపు , ఎర్రబడటం వంటి  సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు సంతాన హీనతకు ఈ బ్యాక్టీరియా కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
 బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ఉన్న పశువులతో సంపర్కం వల్ల సంభవిస్తుందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మగవారిపైనే దీని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి మనుషులకు సంక్రమించడం చాలా అరుదు అని సిడిపి స్పష్టం చేసింది.  కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం, శ్వాస ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరడం వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. వాపు, ఎర్రబడిన వృషణాలు  కొంతమంది మగవారిని వంధ్యత్వానికి గురిచేస్తాయని హెచ్చరిస్తున్నారు.
సిఎన్ఎన్ నివేదిక ప్రకారం గత ఏడాది జూలై చివరి వారం,  ఆగస్టు మొదటి వారం మధ్యకాలంలో  లాన్జౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో లీకేజ్ ద్వారా ఈ బ్యాక్టీరియా  వ్యాప్తి చెందింది. జంతువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని వివరిస్తున్నారు.  ఫ్యాక్టరీలో అవుట్ డేటెడ్ మందులు, శానిటైజర్లు ఉపయోగించడంతో ఈ బ్యాక్టీరియా అలాగే ఉండిపోయిందని అంటున్నారు.
ఈ వ్యాధి సోకిందన్న అనుమానంతో  21,000 మందిని పరీక్షించడంతో ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేలింది. అయితే ఇంతవరకు ఈ వ్యాధి కారణంగా ఎవరూ చనిపోలేదని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కోంది. అయితే ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య  ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని, వ్యాప్తిని నివారించడానికి  చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ పత్రిక తెలిపింది.
చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన కోవిడ్ 19 వైరస్ వ్యాప్తినే  అరికట్టలేక గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలన్నీ ఆందోళన చెందుతుంటే కొత్తగా  ఈ బ్యాక్టీరియా వ్యాప్తి  మరింత ఆందోళన కలిగిస్తుంది.