పిల్లల్ని పెంచే తీరు ఇది కాదు

విజ్ఞానం పెరిగిపోతోంది. విద్యావంతుల సంఖ్యా పెరిగిపోతోంది. పిల్లలకి ఏం పెట్టాలి? వారిని ఎలా పెంచాలి? అనే విషయాల మీద ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అవి సరైనవనా! మనం పిల్లల్ని పెంచుతున్న తీరులో ఏవన్నా తీవ్రమైన లోపాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటున్నారు పరిశోధకులు.

 

తీరు మారింది..

అమెరికాలోని ‘నోట్ర డాం’ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు ఒక పరిశోధనను చేపట్టారు. ఓ 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి పిల్లల్ని పెంచే తీరులో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ మార్పులు వారి వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అని తెలుసుకోవడమే ఈ పరిశోధన లక్ష్యం. ఈ పరిశీలనలో గమనించిన కొన్ని ముఖ్యమైన మార్పులు ఇవీ...

 

- పిల్లల్ని ఎత్తుకుని కాకుండా ఏదో ఒక చోట వారిని ఒంటరిగా వదిలివేయడం జరుగుతోంది. ఊయలలోనో, కారుసీట్ల మీదో, స్ట్రాలీల (strolley) మీదో పిల్లల్ని గంటల తరబడి ఉంచేస్తున్నారు. ఒకవేళ తమతో పాటు తీసుకువెళ్లినా కూడా ‘బేబీ కేరియర్ల’ సాయంతో వారిని కట్టేసి తీసుకువెళ్తున్నారు.

 

- అమెరికాలో కేవలం 15 శాతం తల్లులు మాత్రమే తమ పిల్లలకి ఏడాది వచ్చేవరకూ పాలు పట్టిస్తున్నారు. మిగతా వారంతా ‘infant formula’ పేరుతో కృత్రిమమైన ఆహారానికే ప్రాధాన్యతని ఇస్తున్నారు.

 

- 1970ల కాలంతో పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

 

- పిల్లలు ఏడ్చిన వెంటనే వారిని బుజ్జగించడం అంత మంచిది కాదన్న అభిప్రాయం బలపడిపోయింది.

 

అన్నీ పొరపాట్లే..

పైన పేర్కొన్న విధానాలన్నీ కూడా పొరపాటే అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లలకు పెద్దల స్పర్శ తగులుతూ ఉండటం, తల్లిపాలను అందించడం, నలుగురైదురు చేతుల్లో పెరగడం, వారు ఏడ్చిన వెంటనే ఎత్తుకుని లాలించడం... వంటి చర్యలన్నీ కూడా వారి మానసిక, శారీరిక వికాసానికి అవసరం అంటున్నారు. పిల్లలు ఏడుస్తున్న వెంటనే వారిని లాలించడం అనేది వారి వివేకం మీద ప్రభావం చూపుతుందట. స్పర్శ, లాలనల వల్ల వారిలో ఒత్తిడి తగ్గి, భావోద్వేగాలను నియంత్రించుకునే నేర్పు అలవడుతుందట. ఇక బందీగా ఉంచకుండా స్వేచ్ఛగా మెలసనివ్వడం వల్ల చొరవ, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయని చెబుతున్నారు. నలుగురి చేతుల్లో పెరగడం వల్ల విచక్షణ, వినయం, సహానుభూతి ఏర్పడతాయట.

 

ఫలితాలు అనుభవిస్తున్నాం..

పిల్లల పెంపకంలో ఇలాంటి మానవీయ కోణాలు చెదిరిపోవడం వల్ల ఇప్పటి తరం దూకుడుగా, క్రూరంగా, ఆత్మసాక్షి లేకుండా, జాలిదయ వంటి లక్షణాలను అతీతంగా పెరుగుతున్నారని వాపోతున్నారు. పైగా చిన్నవయసులోనే ఉద్వేగం, క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. మనలోని సహానుభూతి, విచక్షణ, స్వీయనియంత్రణ వంటి లక్షణాలను కుడివైపు ఉన్న మెదడు నియంత్రిస్తుందనీ... అది నిరంతరం మారుతూనే ఉంటుందనీ చెబుతున్నారు. కాబట్టి జీవితంలో ఏ క్షణంలో అయినా సరే తల్లిదండ్రులు తమ పెంపకంలోని లోటుని గమనించి వారితో అనుబంఢాన్ని దృఢపరచుకునే ప్రయత్నం చేస్తే పిల్లవాడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయని సూచిస్తున్నారు.

- నిర్జర.