TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రులకు చిన్నాయన క్లాసుల మీద క్లాసులు

Published on: Sat Sep 27, 2014 3:30PM

 

అసలు కంటే కొసరు ముద్దు అంటారు. ముఖ్యమంత్రి అసలు అయితే ఆయన పుత్రరత్నం కొసరు. అయితే కొసరుగా వుండాల్సిన ఆయన నిరంతరం కసురుకుంటూ వుంటే పరిస్థితి ఎలా వుంటుంది? రాష్ట్ర మంత్రులు అనుభవిస్తున్న మానసిక వేదనలా వుంటుంది. పెద్దాయన ముఖ్యమంత్రి రాష్ట్ర పాలన వ్యవహారాలు చూసుకుంటూ వుంటే, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలతోపాటు పార్టీ వ్యవహారాలను కూడా చిన్నాయన చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. మంత్రులను పెద్దాయన ప్రశ్నిస్తున్నారో లేదోగానీ, చిన్నాయన మాత్రం మంత్రుల పనితీరు మీద నిఘా నేత్రం పెట్టారు. వారు ఏ పని చేస్తున్నారు.. ఏయే అనుమతులు ఇస్తున్నారు.. ఇలాంటి వ్యవహారాలన్నిటి మీదా చిన్నాయన కన్ను వేసి వుంచినట్టు తెలుస్తుంది.

 

మంత్రులు పెద్దాయనతోపాటు చిన్నాయనకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు చేసే ప్రతి పనిమీదా చిన్నాయన రివ్యూ వుంటుంది. ఏదైనా తేడాలుంటే రూమ్‌లోకి పిలిచి క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారని తెలుస్తోంది. నవ్వుతూ చిన్నాయన రూమ్‌లోకి వెళ్ళిన మంత్రులు రూమ్‌లోంచి బయటకి వచ్చేటప్పుడు ముఖాలు వేలాడేసుకుని, వాడిపోయిన తోటకూర కాడల్లాగా దిగాలుగా బయటకి వస్తున్నారట. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు.. ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటూ చిన్నాయన సంధించే ప్రశ్నలకి అప్పటికప్పుడు జవాబు దొరక్క మంత్రులు తెల్లముఖాలు వేసుకుని చూస్తున్నారట. పెద్దాయనే మాకు ఇంతింత క్లాసులు తీసుకోడు.. ఈ చిన్నాయన క్లాసులేంట్రా భగవంతుడా అని లోపల్లోపల కుమిలిపోతున్నారట.

 

చిన్నాయన క్లాసులు పీకే విషయంలో చాలా లిబరల్‌గా వ్యవహరిస్తున్నారట. రాజకీయాలకు పాతవారా.. కొత్తవారా.. చిన్నవారా.. పెద్దవారా.. జూనియర్ మంత్రులా.. సీనియర్ మంత్రులా... ఇలాంటి అడ్డుగోడలేవీ లేకుండా అందరికీ ఒకే స్థాయిలో భారీ క్లాసులు తీసుకుంటున్నారట. చిన్నాయన క్లాసులు వింటున్న వాళ్ళకి ఈయన పూర్వజన్మలో లెక్చరర్ అయి వుంటారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయట. చిన్నాయన కేవలం క్లాసులు తీసుకోవడంతో ఆగకుండా, మంత్రుల పనితీరుకు మార్కులు వేస్తున్నారట, ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారట. ఇంత ఎదిగిన తర్వాత ఇప్పుడు ఎలిమెంట్రీ స్కూలు పిల్లల్లా క్లాసులు వినడం, మార్కులు, ప్రోగ్రెస్ కార్డులేంటి దేవుడా అని పలువురు మంత్రులు తమ సహచరుల దగ్గర వాపోతున్నారట.

 

గమనిక: ఇంతకీ ఆ ముఖ్యమంత్రి పెద్దాయన ఎవరు? ఆయన పుత్రరత్రం చిన్నాయన ఎవరు? వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ పార్టీకి చెందినవారు అనే విషయాలు పాఠకుల ఊహాశక్తికే వదిలిపెట్టడమైనది.