TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ములాయం కుటుంబం చీలడానికి రె"ఢీ"

Published on: Tue Aug 16, 2016 5:25PM

 

ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న ములాయం సింగ్ యాదవ్ ఒకరు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం..దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఆయన తిరుగులేని నేత. అలాంటి నేతకు కుటుంబసభ్యులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాజకీయపరమైన విభేదాలు ములాయం కుటుంబంలో చిచ్చు రగిల్చాయి. ఒకవైపు తొడబుట్టిన తమ్ముళ్లు, మరో వైపు కొడుకు వీరిలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక ములాయం కుమిలిపోతున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం మంత్రి, ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు దానిని సవాల్‌గా తీసుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని పావులు కదుపుతున్నాయి. అయితే ప్రస్తుత అధికార పార్టీ ఎస్పీకి ఈ ఎన్నికలు కత్తి మీద సాములా తయారయ్యాయి. అవినీతి, ప్రజల్లో వ్యతిరేకతతో అఖిలేష్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రిగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టుబిగించిన అఖిలేష్ తండ్రి ములాయం సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా..తనకు తోచినట్లుగా ముందుకు వెళ్తున్నారు. అవి పార్టీకి చేటు తెచ్చేలా కనిపిస్తుండటంతో తండ్రి, కొడుకుల మధ్య కాస్త దూరం పెరిగింది.

 

తాజాగా వచ్చే ఎన్నికల్లో ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్ అఖిలేష్‌కు సూచించారు. దీంతో అఖిలేష్‌, శివపాల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకే తాను మొగ్గు చూపుతున్నట్లు సీఎం తేల్చిచెప్పారు. ఇందుకు ములాయం మరో సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్ సైతం అఖిలేష్‌కే మద్ధతు తెలపడంతో నొచ్చుకున్న శివపాల్ ..తనకు, తన మాటకు విలువలేని చోట ఉండనని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయం అటుతిరిగి ఇటుతిరిగి ములాయం వద్దకు చేరింది. ఆయన తమ్ముడి ప్రతిపాదనకు మద్దతు తెలిపి..కొడుకుపై మండిపడ్డారు. రాజధాని లక్నోలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ములాయం, అఖిలేష్ యాదవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడటానికి మైక్ అందుకున్న ములాయం.."నేను కానీ రంగంలోకి దిగితే..ప్రభుత్వానికి అసలు విషయం అర్థమవుతుంది" అన్నారు..అంతేకాకుండా శివపాల్ యాదవ్ పార్టీని వీడితే సమాజ్‌వాదీ పార్టీ రెండు ముక్కులవుతుందంటూ కొడుక్కి చురకలంటించారు. దీంతో పార్టీ గొడవ..అన్నదమ్ముల గొడవగా ..చవరికి తండ్రీ కొడుకుల గొడవగా మారి మొత్తం ములాయం కుటుంబంలోనే చిచ్చు పెట్టింది. మరి దీనిని ములాయం ఎలా పరిష్కరిస్తారో..?